చంద్రబాబు కొత్త డ్రామా

వైఫల్యాలను కేంద్రంపై నెట్టేందుకు సుప్రీంకు వెళ్తాననే ప్రకటన
నాలుగేళ్లుగా రాష్ట్రానికి చంద్రబాబు చేసిందేమిటీ?
హక్కుల సాధనలో విఫలమై చివర్లో కేంద్రంపై నెట్టే ప్రయత్నం
ఓటుకు కోట్ల కేసుకు భయపడి రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటాలపై నీరు చల్లారు
కోర్టుకు వెళ్తే మొదటి దోషి చంద్రబాబే అవుతారు
హైదరాబాద్‌: చంద్రబాబు తన వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నానికి పూనుకున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంతో తన రాజకీయ ప్రయోజనాలను పొంది ఇప్పుడు కేంద్రం నిధులు ఇవ్వడం లేదు.. సుప్రీం కోర్టుకు వెళ్తామని ఒక కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయనే తరుణంలో కేంద్రం సహకరించలేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం కొత్త ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. విభజన చట్టంలోని అంశాలపై ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాలుగు సంవత్సరాలుగా పోరాడుతుందని గుర్తు చేశారు. కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్న చంద్రబాబు విభజన హక్కులను సాధించడంలో పూర్తిగా విఫలమై ఇప్పుడు చివర్లో కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు.
 
ఓటుకు కోట్ల కేసులో ఎక్కడ విచారణ చేస్తారో.. పోలవరం అవినీతిపై ఎక్కడ సీబీఐతో ఎంక్వైరీ వేస్తారోనని భయంతో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులు ఒత్తారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. చివరకు నియోజకవర్గాలైనా పెంచండి అని ముందే సాగిలపడి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను తాకట్టుపెట్టారని మండిపడ్డారు. విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకువస్తానని చెప్పి ప్రత్యేక విమానాల్లో తిరిగి వేల కోట్లు ఖర్చు చేసి కనీసం రూ. 12 వేల కోట్ల పెట్టుబడులు కూడా తీసుకురాలేదని కేంద్రమే చెప్పిందన్నారు. కానీ రూ. 15 లక్షల కోట్లు వచ్చాయని చంద్రబాబు ప్రకటించుకున్నాడన్నారు.పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నాలుగేళ్ల పాటు చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను తన ప్రయోజనాల కోసం తాకట్టుపెట్టే చంద్రబాబును మొదటి దోషి అన్నారు. 

కేంద్రం నుంచి నిధులు రాలేదంటున్నారంటే ముందు దోషి చంద్రబాబేనని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుంటే నీరు చల్లారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మేలు అన్నారు. చివరకు ప్యాకేజీ ఎంత వచ్చింది చంద్రబాబూ అని ప్రశ్నించారు. నాలుగేళ్లగా అది తీసుకువస్తా.. ఇది తీసుకువస్తానని మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు సుప్రీం కోర్టుకు వెళ్తామని మాట్లాడడం కొత్త డ్రామా అన్నారు.
 
Back to Top