బీజేపీ ఛీ కొడుతున్నా సిగ్గులేదా?


– బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వాస్తవాలు మాట్లాడారు
– ఫిరాయింపు నిరోధక చట్టానికి ఏపీలో తూట్లు
– గవర్నర్‌తీరును ఖండిస్తున్నాం
– బాలకృష్ణ సీఎం చైర్‌లో కూర్చోవడం రాజ్యాంగ విరుద్ధం
హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపులపై మిత్రపక్షమైన బీజేపీ నేతలు ఛీకొడుతున్నా.. టీడీపీ, చంద్రబాబు స్పందించకపోవడం సిగ్గు చేటు అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఏపీలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అపహాస్యం అవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు నిన్న వాస్తవాలు మాట్లాడారని తెలిపారు. గవర్నర్‌ నరసింహన్‌ టీడీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా వ్యహరిస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు.  గురువారం అయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. వైయస్‌ఆర్‌సీపీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన వద్ద ఉన్న అక్రమ సొమ్ముతో అనైతికంగా కొనుగోలు చేశారన్నారు. వారిపై అనర్హత వేటు వేయాలని మూడేళ్లుగా ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదన్నారు.  ఇదే విషయంపై నిన్న బీజేపీ శాసన సభ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు వాస్తవాలు మాట్లాడారని తెలిపారు.  పార్టీ మారిన వ్యక్తులను మంత్రివర్గంలోకి తీసుకోవడం అన్యాయం అంటూ బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారన్నారు. చివరకు మీ మిత్రపక్షమైన బీజేపీనే మిమ్మల్ని తప్పుపట్టినా మీకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న వెంకయ్యనాయుడు పార్టీ మారిన ఇద్దరు ఎంపీలను సస్పెండ్‌ చేశారని గుర్తు చేశారు. ఫిరాయింపుల విషయాన్ని ఆలస్యం చేస్తే ఫిరాయింపుల చట్టం అపహాస్యం అవుతుందని వెంకయ్యనాయుడు అన్నారని గుర్తు చేశారు. ఇవాళ ఏపీలో జరుగుతున్నదేంటని ప్రశ్నించారు. 
గవర్నర్‌ చంద్రబాబును పొగడటం హాస్యాస్పదం
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం అపహాస్యమవుతున్నా పట్టించుకోని గవర్నర్‌ చంద్రబాబును పొగడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడవలసిన గవర్నర్‌ ప్రభుత్వ అనుకూల భజన చేస్తున్నారని ధ్వజమెత్తారు. గవర్నర్‌ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు అతీతంగా లేదన్నారు. ప్రజాస్వామ్య ఉల్లంఘన బాహాటంగా జరుగుతుంటే గవర్నర్‌ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గవర్నర్‌ న్యూట్రల్‌గా ఉండి రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తి చంద్రబాబును పొగడటాన్ని చూస్తే టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లుగా ఉందన్నారు. బీజేపీ ఎంపీ గవర్నర్‌ను మార్చమని కేంద్రాన్ని కోరినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. గవర్నర్‌ పనితీరు, ఆయన వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తుందన్నారు. విలువలను భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని బ్రహ్మండంగా పొగడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  

సీఎం బావమరిది అయినంత మాత్రానా..
బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఓ సమీక్ష కార్యక్రమంలో సీఎం సీట్లో కూర్చోవడం ఏంటని అంబటి ప్రశ్నించారు. మంత్రివర్గ సభ్యులు దేవినేని ఉమా ఆ పక్క సీట్లో కూర్చోని చోద్యం చూడటం ఏంటని ప్రశ్నించారు. ఆయన్ను ఎందుకు అడ్డుకోలేకపోయారని నిలదీశారు. ప్రజాస్వామ్య దేశంలో కొన్ని సంప్రదాయాలు ఉంటాయని, ముఖ్యమంత్రి బావమరిది అయినంత మాత్రానా ఆయన సీట్లో ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో రాజ్యంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని గుర్తు చేశారు. నారా లోకేష్‌ గతంలో ఇలాగే వ్యవహరించడంతో ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకున్నారన్నారు. చంద్రబాబూ..మీరు తప్పుకొని మీ బావమరిదిని సీఎం చేస్తే మాకెలాంటి అభ్యంతరం లేదన్నారు. మంత్రి, ఐఏఎస్‌ అధికారులు బాలకృష్ణకు ఎందుకు చెప్పలేదో అర్థం కావడం లేదన్నారు. ఒ క వేళ చెబితే బాలకృష్ణ కొడతారని భయపడి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ చర్యను వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.



 
 
Back to Top