బాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు


–23 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారు
– నాలుగేళ్లలో కేంద్రం నుంచి ఏం సాధించారు? 
– ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోయడమో టీడీపీ పని
విజయవాడ: చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. నాలుగేళ్ల పాటు మౌనంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడేమో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నాటకాలు ఆడటం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. కేంద్రం బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, ఇందుకు టీడీపీనే కారణమని ఆయన అన్నారు. శుక్రవారం విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పార్థసారధి మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లుగా ఏపీకి అన్యాయం జరుగుతుంటే కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. కేంద్రం నుంచి అవసరమైన నిధులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఈ ప్రభుత్వ పనితీరుపై ఆలోచన చేయాలన్నారు. చంద్రబాబు రాష్ట్ర విభజన నుంచి ఇప్పటి వరకు ఏవిధంగా మోసం చేస్తున్నారో ఒకసారి గమనించాలన్నారు. ఎన్నికల సమయంలో నేనే సీనియర్‌ అని ఎలా అధికారంలోకి వచ్చారో.. ఈ నాలుగేళ్లు ఎలా పాలించారో గమనించాలన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటున్న చంద్రబాబు తెలంగాణలోని వరంగల్‌లో జరిగిన సభలో ఏవిధంగా మాట్లాడారో అర్థం చేసుకోవాలన్నారు. నేను రాసిన లేఖ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పిన చంద్రబాబు ఇక్కడేమో రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారని ్రడ్రామాలాడుతున్నారని వివరించారు. ఈ డ్రామాను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. చంద్రబాబు లెక్కల ప్రకారం నాలుగు సంవత్సరాల కేంద్ర బడ్జెట్‌ వల్ల న్యాయం జరిగిందని, ఇప్పుడేమో అన్యాయం జరిగిందా? అని నిలదీశారు. తనకేదో సంబంధం లేదంటూ చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీలోని కొందరేమో కేంద్రాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరేమో అన్యాయం జరిగిందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఏది నిజమని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర విభజన చట్టంలోని హామీల కోసం ఉద్యమిస్తే..ఆ పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నం చేసేరే తప్ప కేంద్రం నుంచి మీరేమైనా సాధించారన్నారా అన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఢిల్లీకి 23 సార్లు వెళ్లిన చంద్రబాబు ఏం తెచ్చారని ప్రశ్నించారు. మీరు వెళ్లిన 23 సార్లు మీ స్వార్థం కోసం వెళ్లారా? రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వెళ్లారో సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంట్‌ సమావేశాల ముందు మీ పార్టీ ఎంపీలతో ఒక్కసారైనా సమీక్ష చేశారా అన్నారు. కేవలం అహంకారంతో ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోయడం తప్ప ఏమైనా చేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం చాలా స్పష్టంగా రాష్ట్రానికి ఏమేమి ఇవ్వాలో చెప్పిందన్నారు. మొట్టమొదటి నుంచి కూడా ఈ చట్టాన్ని చంద్రబాబు తుంగలో తొక్కి తన స్వార్థం కోసం కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారన్నారు. పోలవరం నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని చట్టం చెబుతుంటే, ఎందుకు చంద్రబాబు తీసుకున్నారని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు ఈ పరిస్థితికి రావడానికి చంద్రబాబే కారణమన్నారు. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్షిస్తున్నామని గొప్పలు చెప్పే మీరు ఇప్పటి వరకు మీరు ఏం సాధించారన్నారు. నాలుగేళ్లు ఎందుకు కేంద్రంపై పోరాటం చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రం కూడా రాష్ట్రాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందో సమాధానం చెప్పాలని పార్థసారధి డిమాండ్‌ చేశారు. 
 
Back to Top