తప్పుడు కేసులతో పోలీసు వ్యవస్థకే మచ్చ

కృష్ణా: రాజకీయ ఒత్తిళ్లతో తప్పుడు కేసు పెట్టడం పోలీసు వ్యవస్థకే మచ్చ అని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ అన్నారు. మంత్రి దేవినేని ఉమా ఆదేశాలతో తనతో పాటు మరో 11 మందిపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇబ్రహీంపట్నంలో పోలీసుల అత్యుత్సాహం చూపుతున్నారని విమర్శించారు. మంత్రి దేవినేని ఉమా ఆదేశాలతో నే తప్పుడు కేసుకు యత్నిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన వాక్‌విత్‌ జగనన్న  ర్యాలీలో వృద్ధుడు చనిపోయాడంటూ కట్టుకథలు అల్లారని ఫైర్‌ అయ్యారు. ఆసుపత్రికి తరలిస్తుండగా రామయ్య చనిపోయాడంటున్న స్థానికులు చెబుతుంటే,  తాము చెప్పినట్లు వినాలని రామయ్య కుటుంబ సభ్యులపై పోలీసుల ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. శవ రాజకీయాలతో ఇబ్బంది పెట్టొద్దని కుటుంబ సభ్యుల వేడుకున్నా వినడం లేదన్నారు. ర్యాలీ వల్లే చనిపోయాడని స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని ఆటో డ్రైవర్‌పై ఒత్తిడి తెస్తున్నారని తప్పుపట్టారు. ఎలాంటి ట్రాఫిక్‌ ఆటంకాలు ఎదురు కాలేదంటున్న ఆటో డ్రైవర్‌ చెప్పినా వినడం లేదన్నారు. మాట వినలేదని ఆటోడ్రైవర్‌ను  అరెస్టు చేసేందుకు యత్నించడగా స్థానికులు అడ్డుకున్నట్లు చెప్పారు.  మృతుడు రామయ్య కుమారుడిని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారని నిలదీశారు. మంత్రి దేవినేని ఆదేశంతోనే నాపై తప్పుడు కేసు పెట్టారని జోగి రమేష్‌ మండిపడ్డారు. వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమానికి వచ్చిన ప్రజాదరణ చూసి ఓర్వలేక తనతో పాటు 11 మందిపై కేసు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక సాక్షిగా ఉన్న ఆటో డ్రైవర్‌ను బలవంతంగా ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తామని జోగిరమేష్‌ పేర్కొన్నారు. 
 
Back to Top