ప్రజలంతా పోరాటం చేస్తుంటే..బాబు విహార యాత్రలు

–  రాష్ట్ర ప్రయోజనాల కంటే మిత్రధర్మం గొప్పదా?
– టీడీపీకి ఓ విధానం లేదు
– ప్రజలను మభ్యపెట్టేందుకే టీడీపీ ఎంపీల డ్రామా
– విభజన హామీల కోసం పోరాటం కొనసాగిస్తాం
విజయవాడ: విభజన చట్టంలోని హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలంతా రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తుంటే చంద్రబాబు మాత్రం పెట్టుబడుల పేరుతో విదేశీ యాత్రలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి విమర్శించారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన  హామీలను సాధించేందుకు టీడీపీకి ఒక విధానం లేదని పార్థసారధి మండిపడ్డారు. ఇవాళ పార్లమెంట్‌లో ఎంపీల డ్రామాను చూస్తే మరోమారు ప్రజలను మభ్యపెట్టినట్లుగా ఉందన్నారు. ప్రజలు ఒక పక్క రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తుంటే..సీఎం మాత్రం ఏదో రాష్ట్రానికి ఒరగబెట్టేందుకు దుబాయి వెళ్లారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి మేలు జరిగే ఏ ఒక్క పని చేయని చంద్రబాబు..నోరు తెరిస్తే చాలు దుబాయి, సింగపూర్, లండన్, జపాన్‌ అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. మనకు రావాల్సిన నిధులు రాబట్టలేక, ఎవరో ఏదో చేస్తారని ఈయన గారు విదేశాలకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. 

బీజేపీ, టీడీపీలు ప్రజల హక్కులను కాలరాస్తున్నాయి..
రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుంటే మా గొంతు నొక్కె ప్రయత్నం చేశారన్నారు. జీఎస్‌టీ నేపథ్యంలో కొన్ని సాంకెతిక కారణాల వల్ల ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెబితే మేం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని స్వయాన టీడీపీ ఎంపీ అంగీకరించారని గుర్తు చేశారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. మనకు హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్, స్టీల్‌ ఫ్యాక్టరీలను టీడీపీ తీసుకురాలేకపోయిందన్నారు. అన్ని రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం నిధులతో ప్రత్యేక ప్యాకేజీ అని మోసం చేస్తే మీరు  దానికి ఒప్పుకుంటారా అని నిలదీశారు. బీజేపీతో కలిసి టీడీపీ నేతలు తెలుగు ప్రజల హక్కులను కాలరాశారని ఆగ్రహంవ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాలుగా ఏపీకి బడ్జెట్‌లో అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ నాయకత్వంలో నాలుగేళ్లుగా విభజన హామీల కోసం ఉద్యమాలు చేస్తే చంద్రబాబు ఎంతసేపు పోలీసు బలగాలతో అణగద్రొక్కే ప్రయత్నం చేశారన్నారు. ఒక్కసారి కూడా కేంద్రం నుంచి మనకు ఏం వస్తున్నాయో చంద్రబాబు ఆలోచించలేదన్నారు. ఎంతసేపు ప్రజలను మభ్యపెట్టవచ్చు...ఖజానాను దోచుకోవచ్చు అన్న ఆలోచన చేశారని విమర్శించారు. చంద్రబాబు స్వార్థం కోసం రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు. కేంద్రానికి పోలవరానికి అప్పగించి ఉంటే నిధుల సమస్య, కాంట్రాక్టర్ల గొడవలు ఉండేవి కాదన్నారు. కేవలం ముడుపుల కోసమే పోలవరాన్ని చంద్రబాబు తీసుకున్నారని ఆరోపించారు. ఆ రోజు చట్టంలో అటవీ భూములను డీ–ఫారెస్టు చేసి రాజధాని నిర్మాణానికి భూములు ఇస్తామంటే ఒక స్వార్థంతో చంద్రబాబు తన బినామీలను రీయల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి దించి పేదల భూములను లాక్కున్నారన్నారు. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు చంద్రబాబు తన ఇష్టారాజ్యంగా సింగపూర్‌ కంపెనీలకు దానం చేశారన్నారు. 

ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు..
పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను వాడుకోవచ్చు అని విభజన చట్టంలో పొందుపరిచారన్నారు. ఏపీ వద్ద నిధులు లేవని తెలిసి కూడా ఓటుకు నోటు కేసు మూలంగా పారిపోయివచ్చారని విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు విషయం కారణంగా మనకు రావాల్సిన నీటి వాట, ఆస్తుల విషయంలో కూడా చంద్రబాబు తెలంగాణతో రాజీ పడ్డారన్నారు. కృష్ణనదిపై ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకుంటుంటే కనీసం నోరు విప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని చంద్రబాబును నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసి..ఈ రోజు సంకీర్ణ ధర్మం అంటూ రాష్ట్ర అభివృద్ధి కంటే మిత్రధర్మం గొప్పదని ప్రవర్తిస్తున్న తీరు దారుణమన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలో విభజన హామీల కోసం ఉద్యమిస్తామని పార్థసారధి తెలిపారు.
 
Back to Top