విభజనపై సీమాంధ్ర నాయకుల డ్రామాలేంటి?

‌హైదరాబాద్:

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) ముందు సవరణలు ప్రతిపాదిస్తూ చివరి నిమిషంలో కూడా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు విభజనకు సహకరిస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. విభజన ప్రక్రియను కేంద్రం వేగంగా ముందుకు తీసుకెళుతున్న సమయంలో తెగించి పోరాటం చేయకుండా ఈ డ్రామాలేమిటని కేంద్ర మంత్రులపై నిప్పులు చెరిగింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారంనాడు వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియా సమావేశంలో మాట్లాడారు.

‘హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) చేయాలని, సీమాంధ్రకు యూనివర్సిటీలు కావాలంటూ సవరణలు కోరతారా? ఇదేనా మీరు సమైక్యం కోసం చేస్తున్న పోరాటం’ అని పద్మ మండిపడ్డారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఏదో చేస్తామంటూ ఇంతకాలం మాట్లాడి చివరకు విభజనకు సహకరిస్తూ వారంతా చవటలు, దద్దమ్మలుగా మారిపోయారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగువారిని చీల్చడానికి వీల్లేదని తమ పదవులను వదులుకోవాల్సిన మంత్రులకు అసలు పౌరుషం ఉందా అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏదేదో చేసేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్, టీడీపీ ఎంపీ సుజనాచౌదరి కేంద్రంతో కుమ్మక్కయ్యారని విమర్శించారు. కాంగ్రె‌స్ అధిష్టానం చెప్పినట్టు ఆడుతున్నందునే లగడపాటికి చెందిన ల్యాంకో ఇ‌న్‌ఫ్రా సంస్థ తీసుకున్న రుణాలు చెల్లించకపోయినా కొత్తగా రూ. 2,300 కోట్ల రుణం మంజూరైందని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. సుజనాచౌదరి సంస్థలకు కూడా కేంద్రం భారీగా రుణాలిచ్చిందని ఆమె పేర్కొన్నారు.

అసలు చంద్రబాబు డిమాండ్ ‌ఏమిటి? :
‘అన్ని పార్టీల నేతల వద్దకూ వెళ్లి లాబీయింగ్ చేస్తున్న టీడీపీ అ‌ధ్యక్షుడు చంద్రబాబు వారిని అడుగుతున్నదేమిటి? అసలు ఆయన డిమాండ్ ఏమిటి?’ అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. కొద్ది నెలల క్రితమే తమ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే కచ్చితమైన డిమాండ్‌తో జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలందరినీ కలసి వారి మద్దతు కూడగట్టారని, ఇప్పుడు ఎటువంటి డిమాండ్ లేకుండా ‌చంద్రబాబు చేస్తున్న హడావుడి శ్రీ జగన్ ప్రయత్నాలపై నీళ్లు చల్లే విధంగా ఉందని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చివరి వరకూ తలూపిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి సమైక్యం పట్ల చిత్తశుద్ధి ఏమాత్రం లేదని తేలిపోయిందని పద్మ విమర్శించారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే అందరినీ కలుపుకుని సమైక్యం కోసం పోరాడేవారన్నారు. ఈ తరుణంలో కిరణ్, చంద్రబాబు, ఎంపీలు, కేంద్రమంత్రులంతా సమైక్యం అనాలని ఆమె డిమాండ్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top