జగన్‌ను విమర్శించే స్థాయి హరికి లేదు

హైదరాబాద్:

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిరెడ్డి విమర్శించే అర్హత సబ్బం హరికి లేదని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిప్పలు చెరిగారు. కాంగ్రెస్‌ పార్టీ వేసే కుక్క బిస్కట్ల కోసం వెంపర్లాడే ఎంపీలు శ్రీ జగన్‌ను శంకించడం ఏమిటి? అని నిలదీశారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు పనిగట్టుకుని ఆయనపై ఎందుకు విష ప్రచారం చేస్తున్నార’ని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి ప్రజల నుంచి లభిస్తున్న విశేష ఆదరణను చూసి ఓర్వలేక సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మొదలు కాంగ్రెస్, టీడీపీకి చెందిన కోస్తా, రాయలసీమ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ ఒక స్క్రిప్టు ప్రకారం శ్రీ జగన్ సమైక్యవాది కాదంటూ దుష్ర్పచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు. తాజాగా ఈ బృందంలో సబ్బం‌ హరి కూడా చేరారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పద్మ మాట్లాడారు.

సమైక్య ఉద్యమం చేసిందెవరు?:
‘విభజనకు నిర్ణయం తీసుకున్న సోనియాను ఇప్పటివరకూ పల్లెత్తు మాట అనకుండా, అక్టోబర్ 3న కేంద్ర మంత్రివర్గం విభజన నిర్ణయం ఆమోదించినప్పుడు కూడా నోరు మూసు‌కుని కూర్చున్న ఎంపీలు ఇప్పుడు తాము కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టామంటూ గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ జూలై 30న సీడబ్ల్యూసీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంటోందని తెలిసి శ్రీ జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారు.‌ కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలెవరూ అప్పుడు రాజీనామాలు చేయలేదు. సమైక్యంగా ఉంచేందుకు కలిసి పోరాడుదామని శ్రీ జగన్ చేతులు జోడించి మరీ అందరికీ విజ్ఞప్తి చేశారు. బిల్లు రాకముందే సమైక్య తీర్మానం చేసి పంపుదామని కోరారు. అవేవీ మీ చెవికెక్కలేదా?’ అని పద్మ ప్రశ్నించారు.

‘‌శ్రీ జగ‌న్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఒంటరిగానే విభజనకు వ్యతిరేకంగా దీక్ష చేశారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గుంటూరులో దీక్ష చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా కేంద్ర మంత్రివర్గ నిర్ణయాన్ని తప్పుపడుతూ నెల రోజులలోపే రెండవసారి దీక్ష చేయడం ద్వారా శ్రీ జగన్ ఆరోగ్య సమస్యలు తెచ్చుకున్నారు. విభజన అన్యాయం అంటూ రాష్ట్రపతికి లేఖలు రాశారు. బిల్లు వచ్చాక దానిని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతికి అఫిడవిట్లను అందజేశారు. మీకు ఇవన్నీ కనపడలేదా‌? మీ కళ్లు బైర్లు కమ్మాయా! ’ అంటూ పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టికెట్ ఇవ్వలేదనే సబ్బం విమర్శలు:

విభజన ప్రక్రియ ఆరు నెలలుగా సాగుతున్నా ఏమీ చేయలేని సబ్బం హరి ఇప్పుడు శ్రీ జగన్ సమైక్యవాదంపై విమర్శలు చేయడానికి కారణం ఆయనకు తమ పార్టీ ఎంపీ టికె‌ట్ ఇవ్వ‌కపోవడమేనని పద్మ చెప్పారు. లోక్‌సభలో శ్రీ జగన్, తాను పక్కపక్కన కూర్చున్నామని చెప్పడం ఒక్కటే హరి చెప్పిన నిజమన్నారు. ఆయన కాంగ్రెస్, సోనియా ఏజెంట్‌గానే కొంతకాలం శ్రీ జగన్‌తో కలిసి ఉన్నారని, శ్రీ జగన్‌కు నచ్చజెప్పి కాంగ్రెస్‌కు దగ్గర చేయాలన్న ప్రయత్నాలకు లొంగలేదు కనుకే ఇప్పుడు విమర్శలకు దిగారని ఆరోపించారు. ‘వైయస్ఆర్‌సీపీలో చేరాలనుకుంటే ఎంపీ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రమ్మని‌ శ్రీ జగన్ మీకు చెప్పిన మాట నిజమా‌ కాదా’ చెప్పండని సబ్బం హరిని పద్మ నిలదీశారు.

Back to Top