'గిరిజనులను అవమానించినందుకు మంత్రి క్షమాపణ చెప్పాలి'

హైదరాబాద్: షెడ్యూల్డు కులాలు, తరగతులు, వెనుకబడిన వర్గాల సంక్షేమ కార్యక్రమాల్లో కోతలు పెట్టడంపై శాసనసభలో దుమారం రేగింది. బుధవారం శాసనసభలో సంక్షేమ పద్దులపై జరిగిన చర్చకు మంత్రి ఇచ్చిన సమాధానంపై వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సంక్షేమ పథకాల్లో కోతలు పెడుతున్నారని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా మంత్రి రావెల కిషోర్‌బాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మండిపడింది. పోడియాన్ని చుట్టుముట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మంత్రితో క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేసింది. గిరిజనులను అవమానించేలా మంత్రి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రతిపక్షం సభ నుంచి వాకౌట్ చేసింది. ఆ తర్వాత సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల పద్దులను సభ ఆమోదించింది. బుధవారం సభలో  సంక్షేమ శాఖల పద్దులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ నిధులకు కోతలు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటే ఎలా? అని ప్రశ్నించారు. చర్చలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షం వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించింది.

నిధులకు కోతలు పెట్టి ...: బడ్జెట్‌లో నిధులకు కత్తెరవేసిన మీరు ఎస్సీ, ఎస్టీలకు మేలు  చేస్తున్నట్లు ఎలా చెబుతున్నారని  జగన్‌మోహన్‌రెడ్డి అధికారపక్షాన్ని నిలదీశారు. చర్చ సందర్భంగా జగన్ జోక్యం చేసుకుని.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, పెన్షన్లు తదితర అంశాల్లో ప్రభుత్వ తీరు, ఆ వర్గాలకు టీడీపీ చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. గిరిజన్ సబ్‌ప్లాన్ కింద బడ్జెట్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్లు పెట్టారని, మార్చి 3 నాటికి 1045 కోట్లే ఖర్చు చేశారని, ఇది వైఫల్యమా? కాదా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘గత పదేళ్లలో ప్రణాళికా వ్యయంలో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌కు 34 శాతం ఉండగా మీ హయాంలో 23 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది తొలుత రూ.4,280 కోట్లు అని చెప్పారు. రివైజ్డ్ ఎస్టిమేషన్స్‌లో రూ.3,475 కోట్లు పెట్టారు. అంటే రూ.805 కోట్లు తగ్గించారు, ఇదేనా.. మీకు ఎస్సీ ఎస్టీల మీద ఉన్న ప్రేమ..’ అని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు రుణాలిచ్చే విషయంలో టీడీపీ ప్రభుత్వం మొండిచేయి చూపిందని మండిపడ్డారు. ‘‘ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.335 కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించి రూ.84 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఎస్టీలకు రూ.94 కోట్లు లక్ష్యంగా పెట్టి రూ.9 కోట్లు ఇచ్చారు. ఇక బీసీలకు రూ.361 కోట్లు లక్ష్యం నిర్దేశించి రూ.2 కోట్లు, మైనార్టీలకు రూ.24 కోట్లు లక్ష్యంగా పెట్టి ఒక్క పైసా ఇవ్వలేదు. క్రిస్టియన్ మైనార్టీలకూ రూ.6.77 కోట్లు లక్ష్యంగా నిర్దేశించి పైసా రుణమివ్వలేదు. ఇలాంటి మీరా ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడేది?’’ అని దుయ్యబట్టారు. ఈ గణాంకాలు సరికాదని మంత్రి మృణాళిని చెప్పబోగా... ‘ఈ లెక్కలు నేను చెబుతున్నవి కాదమ్మా.. స్వయానా సీఎం నిత్యం పర్యవేక్షించే సీఎం డాష్‌బోర్డ్‌లోని వివరాలే. కావాలంటే మీరు చూసుకోండి’ అని జగన్ నొక్కి చెప్పారు.

పెన్షన్ల కోత కనిపించలేదా?: వృద్ధులు, వితంతువులు, వికలాంగులు.. ఇలా అందరికీ పింఛన్లలో కత్తిరింపులు చేస్తున్నది మీరు కాదా?  అని ప్రశ్నించారు. ‘‘43.13 లక్షల పెన్షన్లు ఉంటే మీరు ఇస్తున్నది 37 లక్షల పైచిలుకు మాత్రమే. మరో 3 లక్షల దరఖాస్తులు జన్మభూమి ద్వారా వచ్చాయని చెబుతున్నారు. అంటే సుమారు 10 లక్షలమందికి ఇవ్వాల్సి ఉంది. నెలకు రూ.402 కోట్ల చొప్పున 12 మాసాలకు రూ.4,831 కోట్లు అవసరం ఉంది. కానీ మీరు పెన్షన్లకు బడ్జెట్‌లో పెట్టింది రూ.3,741 కోట్లు. అంటే మిగతా 3 నెలలు పెన్షన్లు ఇవ్వరా? రూ.1,100 కోట్లు కోతలేసి వారికి ఎగ్గొడతారా?’’ అని  నిలదీశారు.  ప్రతిపక్ష నేత ప్రశ్నలకు మంత్రి కిమిడి మృణాళిని సమాధానమిస్తూ.. ఏప్రిల్ 1నుంచి మరింత మందికి పెన్షన్లు ఇవ్వనున్నామని చెప్పారు. అవసరమైతే అధికంగా నిధులిస్తామన్నారు. జగన్ ప్రతిస్పందిస్తూ.. ‘‘నేను మీ సీఎం పర్యవేక్షించే డాష్‌బోర్డ్‌లోని విషయాలే మాట్లాడాను, దీనికి ముందు సమాధానం చెప్పాలి..’’ అని డిమాండ్ చేశారు.
 
సమాధానం చెప్పలేక: విపక్ష నేత జగన్‌తోపాటు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, ముత్యాలనాయుడు అడిగిన ప్రశ్నలకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు సమాధానం చెప్పలేక ఇతర అంశాల్లోకి పోయి సభను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆయన బాక్సైట్ గురించి మాట్లాడటంతో అధికారపార్టీ సభ్యులు కూడా నివ్వెరపోయారు. ‘మీరు అజ్ఞానులు, అమాయకులు, ధన, మాన ప్రాణాలను దోచుకుంటున్నారు’ అని మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షానికి చెందిన ఎస్సీ,ఎస్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి క్షమాపణ చెప్పాలంటూ పోడియం ముందు నిరసన తెలిపారు.దీంతో మంత్రి రావెల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఉంటే రికార్డుల నుంచి తొలగిస్తానని డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.
Back to Top