బాబు పాలనలో ఎక్కడైనా ధర్మం ఉందా?



– ధర్మాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం అధర్మంగా వ్యవహరిస్తోంది
– బీజేపీని గట్టిగా విమర్శించే ధైర్యం చంద్రబాబుకు లేదు
– ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెటరని సన్మానాలు చేసుకున్నారు
– టీటీడీ అక్రమాలు వెలుగులోకొస్తుంటే చీమ కుట్టినట్లు కూడా లేదా? 
– సదావర్తి భూములు దోచుకుతినేందుకు టీడీపీ ప్రయత్నం
– ప్రభుత్వమే ఇలా ఉంటే సామాన్యున్ని రక్షించేదెవరు?

విజయవాడ: చంద్రబాబు పాలనలో ధర్మం ఎక్కడైనా ఉందా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెటరని ఆ రోజు సన్మానాలు చేసుకున్న టీడీపీ ఇవాళ ధర్మ పోరాటం చేయడం బాధాకరమన్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే జాలేస్తుందని, సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు  ధర్మ పోరాటం చేస్తారట అని విమర్శించారు. మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  కర్నాటకలో భారతీయ జనతా పార్టీని ఓడించానని చంద్రబాబు భుజాలు తరుముకున్నారన్నారు. కేఈ కృష్ణమూర్తి కర్నాటకలో ఎవరూ కూడా బీజేపీకి ఓటు వేయరని ప్రకటించారు. ఆ మరుసటి రోజు కాల్వ శ్రీనివాసులు స్పందిస్తూ కర్నాటకలో అందరూ మాకు సమానమే అన్నారన్నారు. చంద్రబాబు కూడా బీజేపీకి ఓటు వేయవద్దని ఎక్కడ చెప్పలేకపోయారని ప్రశ్నించారు. ఇంత గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు ఎందుకు కర్నాటక ప్రచారానికి వెళ్లలేదని నిలదీశారు. సత్యనాదేళ్లకు తానే ట్రైనింగ్‌ ఇచ్చానని, ఇంకా ఎన్నోన్నో చెప్పుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో టీడీపీ పని చేసిందని చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీని చంద్రబాబు గట్టిగా విమర్శించే ధైర్యం లేదన్నారు. నిన్న యనమల రామకృష్ణుడు ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారన్నారు. అక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు గాలి జనార్ధన్‌రెడ్డి ప్రయత్నించారని, ఆ ఆడియో టేపులు ఉన్నాయన్నారు. దీని వెనుక వైయస్‌ జగన్‌ ఉన్నారని తమపై ఆరోపణలు చేశారన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో ప్రత్యక్షంగా ఓ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తే..అందులో చంద్రబాబు వాయిస్‌ ఉందని నిర్ధారణ అయ్యిందన్నారు. ముందు ఈ కేసుపై టీడీపీ నేతలు మాట్లాడాలన్నారు. చట్టబద్ధంగా ఎవరు చేసినా మేం ఖండిస్తామన్నారు. ఓటుకు కోట్లు కేసును టీడీపీ ఎందుకు సమర్ధించుకుంటుందని, దర్యాప్తుకు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. ఏవేవో మాట్లాడితే తెలుగు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా అని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీపై బురద జల్లితే ఒప్పుకోమన్నారు. కర్నాటకలో జరిగిన దురాక్రమణను ఖండిస్తున్నామన్నారు. అదే తరహాలో ఓటుకు కోట్లు కేసుపై కూడా విచారణచేపట్టాలని ఆయన డిమాండు చేశారు. 
ధర్మ పోరాట సభ అంటూ చంద్రబాబు కొత్త నాటకానికి తెర లేపారన్నారు. ధర్మం నాలుగు పాదాలపై నడిస్తేనే పాలన సక్రమంగా సాగుతుందన్నారు. ఇవాళ రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందన్నారు. సంతలో పందుల కంటే హీనంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తే...నాలుగేళ్ల పాటు వారితో పాటు  అధికారంలో ఉన్న టీడీపీ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. పైగా ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మిన్నా అంటూ సంబరాలు చేసుకొని, పబ్బం గడుపుకొని ఇవాళ ధర్మపోరాట సభ అంటూ నాటకాలు అడటం దారుణమన్నారు. ధర్మం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. మహాత్మాగాంధీని చంపిన గాడ్సే మరునాడు గాంధీజీకి సంతాప సభ పెట్టినట్లుగా ఉందని చంద్రబాబు ధర్మపోరాట దీక్షను అభివర్ణించారు. విశాఖపట్నంలో ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా ప్రదర్శన చేపట్టేందుకు మా నాయకుడు వైయస్‌ జగన్‌ బయలుదేరితే ఏయిర్‌పోర్టుపై ఏవిధంగా నిర్భందించారో రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. యువభేరి సభ పెడతామంటే దానికి అనుమతించలేదన్నారు. అన్ని పక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తేమంటే ఒప్పుకొని చంద్రబాబు ఈ రోజు ప్రజాధనంతో ధర్మపోరాటం చేస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్లు బీజేపీతో సహజీవనం చేసి, ఇవాళ మాపై అక్రమ సంబంధం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సాక్షాత్తు టీటీడీ దేవస్థానంలో బీజేపీ మంత్రి భార్యకు పదవి ఇచ్చారని గుర్తు చేశారు. నాలుగేళ్ల సమయానికి వృథా చేసిన చంద్రబాబు ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని ఇవాళ డ్రామాలాడితే ప్రజలు క్షమించరన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావాల్సిన ప్రయోజనాలను తాకట్టుపెట్టిన చంద్రబాబుకు ధర్మపోరాటం చేసే నైతిక హక్కు లేదన్నారు. హక్కుల సాధనకు పోరాటం చేస్తున్న ప్రతిపక్షంపై ఉక్కుపాదం మోపిన చంద్రబాబుకు సిగ్గుండాలన్నారు. అసలు ఈ రాష్ట్రంలో ధర్మం ఉందా అని నిలదీశారు. ఏం అంశం కూడా నీతిగా, నిజాయితీగా జరుగుతుందా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ధర్మం అనే పదానికి అర్థం తెలుసా అని నిలదీశారు. 
తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకుల మధ్య చిచ్చుపెట్టారని మండిపడ్డారు. విజయవాడ ఆలయంలో క్షుద్రపూజలు చేసిన సంఘటనలు ఈ ప్రభుత్వ హయాంలోనే చూశామన్నారు. సదావర్తి భూములను దోచుకుతినేందుకు ప్రయత్నించారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పెట్రో ధరలు ఒక్క రూపాయి పెరిగితే ఆ రోజు ప్రభుత్వమే భరించిందన్నారు. నాయకత్వం వహించే మనిషికి మంచి మనసు ఉండాలన్నారు. చంద్రబాబుకు పొద్దున లేచింది మొదలు ఎవరో ఒకరిపై ఆడిపోసుకోవడమే అని ధ్వజమెత్తారు. ధర్మపోరాటం అంటూ మాపార్టీపై నిందలు వేయడం దుర్మార్గమన్నారు. వినేవాడు ఉంటే చంద్రబాబు ఏదైనా చెబుతారని ఫైర్‌ అయ్యారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్న చంద్రబాబు మూల్యం చెల్లించుకోవడం తధ్యమన్నారు. ఏపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఒంటెద్దు పోకడలతో చేస్తున్న టీడీపీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు హర్షించరన్నారు.  
 
Back to Top