బీజేపీ..టీడీపీ శకం ముగిసింది


– పాలనను గాలికొదిలేసిన పాలకులు 
– ప్రత్యేక హోదా పేరిట ధర్మ దీక్ష అంటూ బాబు డ్రామాలు
– దీక్ష పేరుతో రూ.20 కోట్ల ప్రజా ధనం వృథా
– ఓ వైపు హోదా అంటూనే ..మరోవైపు నీరుగార్చుతున్నారు
– వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే దండగ అన్నారు
– టీడీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీలుగా వ్యవహరిస్తున్నారు


విశాఖ: బీజేపీ, టీడీపీ శకం ముగిసిందని, ఆ పార్టీలను ప్రజలు క్షమించరని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ఓ వైపు హోదా అంటూనే..మరోవైపు నీరుగార్చుతున్నారని మండిపడ్డారు. దేశంలో, రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని విమర్శించారు. విశాఖలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.  అసలు ప్రభుత్వాలు ఉన్నాయా? లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. పరిపాలన గాలికి వదిలేశారని మండిపడ్డారు. కేంద్రానికి ఎలాంటి బాధ్యతను నిర్వర్తించడం లేదన్నారు. రాష్ట్రంలో ఎండకాలంలో తాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. ఉపాధికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని, దీనికి ప్రణాళికలు తయారు చేయాల్సి ఉందన్నారు. రైతులకు, సామాన్య ప్రజానికానికి జరగవల్సిన అభివృద్ధి కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించడం లేదన్నారు. ల్యా అండ్‌ ఆర్డర్‌ లేకుండా పోయిందన్నారు. ఎటు చూసినా మహిళలపై దాడులు జరుగుతున్నాయన్నారు. కేంద్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. మన డబ్బులు మనకు ఇవ్వాలంటే బ్యాంకుల్లో డబ్బులు లేవన్నారు. ఏటీఎంలో నో క్యాష్‌ బోర్డులు ప్రత్యక్షమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని, రాష్ట్ర భవిష్యత్తును భ్రష్టు పట్టించారన్నారు. అంకెల గారడి తప్ప బడ్జెట్‌లో పేదలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. పార్లమెంట్‌లో ఇచ్చిన హామీకి దిక్కు లేదన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీ అంటూ మోసం చేశారన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ నాలుగేళ్లుగా ఉద్యమాలు చేస్తే ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. అయినా చంద్రబాబులో చిత్తశుద్ధి లేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే దాని వల్ల ప్రయోజనం ఏంటీ అన్నారని, నిరాహార దీక్షలు చేస్తే హేళనగా మాట్లాడారన్నారు. ఉద్యమం చేస్తే అక్రమ కేసులు బనాయించారన్నారు. 

చంద్రబాబు ధర్మ దీక్ష పేరుతో నిరాహార దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందని బొత్స సత్యనారాయణ విమర్శించారు. జపాన్‌ తరహా దీక్ష చేయాలని గతంలో చెప్పారని గుర్తు చేశారు. రేపటి దీక్షకు మాత్రం ప్రజాధనాన్ని రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ దీక్షకు మహిళలను, విద్యార్థులను తరలించాలని చంద్రబాబు ఆదేశించడం దారుణమన్నారు. ఆ రూ.20 కోట్లు 108, 104 పథకాలకు వెచ్చించి ఉంటే రోగులకు ఉపయోగకరంగా ఉండేదన్నారు. రేపు దీక్ష ఏ దేశం తరహా ఉద్యమం చేస్తున్నారో చెబితే ఆనందిస్తామన్నారు. చంద్రబాబు వ్యవహార శైలి చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. దీక్ష చేసేందుకు ఇంత హడావుడి ఎందుకు బాబు అని ప్రశ్నించారు. గాంధీ, అంబేద్కర్‌ విగ్రహాల ముందు దీక్ష చేస్తే సరిపోతుందని, కానీ చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం దీక్ష చేస్తున్నారన్నారు.  చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేస్తే బాగుంటుందని సూచించారు. మాతో కలిసి రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేయాలని కోరితే హేళన చేసిన చంద్రబాబు రేపు రూ.20 కోట్లతో దీక్ష చేయడం ఎందుకని ప్రశ్నించారు. చిత్తశుద్దితో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలని బొత్స డిమాండు చేశారు. బీజేపీకి అధికారమే పరమావధిగా పాలిస్తుందని, ఇలాంటి పాలన బాధాకరమన్నారు. బీజేపీ, టీడీపీ శకం ముగిసిందని, ఆ పార్టీలను ప్రజలు క్షమించరని బొత్స పేర్కొన్నారు. ఆ పార్టీలకు నూకలు చెల్లాయని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వీధి రౌడీలుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలను వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. నోట్ల రద్దు సమయంలో శేఖరరెడ్డి ద్వారా చంద్రబాబు డబ్బులు మార్చుకున్నది వాస్తవమా? కాదా సమాధానం చెప్పాలన్నారు. ఆ వాగ్మూలంలో ఏముందో చెప్పాలన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top