ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల ఆకాంక్ష‌

- కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు హోదాను తాక‌ట్టు పెట్టారు
- ముడుపుల కోస‌మే చంద్ర‌బాబు ప్యాకేజీ జ‌పం
- విజ‌య‌న‌గ‌రం క‌లెక్ట‌రేట్ ముట్ట‌డి కార్య‌క్ర‌మంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌
విజ‌య‌న‌గ‌రం: ప‌్ర‌త్యేక హోదా ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అని, దాన్ని సాధించే వ‌ర‌కు వెనుక‌డుగు వేసేది లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. గురువారం విజ‌య‌న‌గ‌రం జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట చేప‌ట్టిన ధ‌ర్నాలో ఆయ‌న మాట్లాడుతూ..చంద్ర‌బాబు ప్ర‌త్యేక హోదా విష‌యంలో అనుస‌రించిన విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు.  చ‌ంద్ర‌బాబు నాయుడు త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చుకునేందుకు కేంద్రంపై నెపం వేస్తున్నాడ‌ని  విమ‌ర్శించారు. నాలుగేళ్లుగా కేంద్రం బాగా చేస్తోంద‌న్న చంద్ర‌బాబు మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఇప్పుడు కేంద్రంపై నింద‌లు వేసి తాను త‌ప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.  ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీడీపీకి చిత్త‌శుద్ధిలేద‌ని మండిప‌డ్డారు. టీడీపీ ఎంపీలు సైతం వాళ్ల రాజ‌కీయ ల‌బ్ధికోసం పార్ల‌మెంట్‌లో ఏదో ఆందోళ‌న చేశామంటే చేశామ‌న్న‌ట్లు చేసి మ‌మ అనిపించార‌న్నారు. బాబు పాల‌న‌లో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింద‌ని, రాష్ట్రంలో అబినీతి పెరిగిపోయింద‌న్నారు. 
ప్ర‌త్యేక హోదా అన్న‌ది రాష్ట్రానికి ప్రాణ‌వాయువు అని, అదొక సంజీవ‌ని  అన్నారు.  హోదా వ‌స్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని, హోదా ఉంటేనే మ‌నం పొరుగు రాష్ట్రాల‌తో పోటీప‌డ‌గ‌ల‌మ‌న్నారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధించే వ‌ర‌కు తాము వైయ‌స్ జ‌గ‌న్ నేతృత్వంలో పోరాటం చేస్తామ‌ని  స్ప‌ష్టం చేశారు.  
Back to Top