చంద్రబాబును మించిన నటుడు లేడు


– కాంగ్రెస్‌తో పొత్తుకు బాబు వెంపర్లాట
– మొదట్నుంచీ కాంగ్రెస్‌కు సహకరిస్తూనే వస్తున్నారు
– స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు 
 

చంద్రబాబును మించిన నటుడిని తానెప్పుడు చూడలేదని లక్ష్మీపార్వతి అన్నారు. సినీనటులు పొట్టకూటి కోసం వేషాలు వేసుకుంటే.. చంద్రబాబు మాత్రం అవినీతిని కాపాడుకోవడం కోసం, తప్పులను కప్పి పుచ్చుకునేందుకు రోజుకో పార్టీతో పొత్తుపెట్టుకుంటాడని ఆమె తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా, అశాస్తీ్రయంగా విభజించారంటూ 2014 ఎన్నికలకు ముందు నుంచీ కాంగ్రెస్‌ పార్టీని తిట్టిపోసిన చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో అదే పార్టీతో పొత్తు పొట్టుకునే విధంగా సంకేతాలు పంపడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. సోనియా గాంధీని ఇటలీ దయ్యం అని తిట్టిన చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం ఎన్నికలకు ఏడాది ముందు కాంగ్రెస్‌తోపొత్తుకు ఉవ్విళ్లూరుతున్నారని ఆమె పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి పదవులు అనుభవించిన టీడీపీ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఎన్‌డీఏ నుంచి బయకొచ్చిందని పేర్కొన్నారు. నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేదని ఆమె విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ను వెళ్లాడని ఆమె ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  మాత్రమే ఏపీకి ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. కుమారస్వామి ప్రమాణ స్వీకార సభలో సోనియా గాంధీకి ఒంగి ఒంగి దండాలు పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీకి చెవిలో చెప్పడం.. ఆయన వద్దకు వెళ్లి మరీ మాట్లాడేందుకు ప్రయత్నించడం చూస్తుంటే చంద్రబాబు దిగజారుడుతనం బయటపడిందని తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న పార్టీలన్నీ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటున్న పార్టీలేనని.. అందుకే చంద్రబాబు కూడా ఆ పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని తెలిపారు. ఎన్నికకో పొత్తుతో వెళ్లే పార్టీ టీడీపీ అని.. ఒంటరిగా పోరాడే పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని ఆమె స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లోనూ వైయస్‌ఆర్‌సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎవరిస్తే వారికి మద్ధతు తెలుపుతామని జగన్‌ మొదట్నుంచి చెబుతున్నారని.. ఇప్పుడూ అదే చెబుతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పేరు మార్చి చంద్రబాబు పార్టీ అని పెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌తో పోరాడేందుకు దివంగత ఎన్టీఆర్‌ పార్టీని స్థాపిస్తే అదే కాంగ్రెస్‌తో బాబు అంటకాగడం సిగ్గుచేటన్నారు. ఎన్టీఆర్‌ ఫొటోను కూడా వాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. తెలుగు జాతి విలువల గురించి మాట్లాడే యనమల రామకృష్ణుడికి  ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ మాట్లాడేటప్పుడు విలువలు గుర్తురాలేదా అని ప్రశ్నించారు. 
 
Back to Top