'చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి'

హైదరాబాద్ః రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని తెలంగాణ రైతు విభాగం అధ్యక్షుడు ఎడ్మ క్రిష్ణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం మీద రైతాంగానికి నమ్మకం పోయిందని క్రిష్ణారెడ్డి అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను సీఎంగానీ, మంత్రులుగానీ పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. రైతు సమస్యలపై హైదరాబాద్ లో మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల కోసం ఎంతో చేశారని పార్టీ నేత శివకుమార్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 421 జీవో తీసుకొచ్చి రూ. లక్షన్నర పరిహారం అందించారని చెప్పారు. రైతు క్షేమంగా ఉంటేనే ప్రపంచం బాగుంటుందని రాజశేఖర్ రెడ్డి గుర్తించారని శివకుమార్ తెలిపారు.  ప్రభుత్వం కరువు ప్రాంతాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు. 

చనిపోయిన రైతు కుటుంబాలకు  రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించడంతో పాటు..  రైతు కూలీలకు ఉపాధి.. ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఆందోళనలు కార్యక్రమాలు నిర్వహిస్తామని  వైఎస్సార్సీపీ నేతలు వెల్లడించారు.
Back to Top