దళిత ఉద్యోగి రవి ఆత్మహత్యకు చంద్రబాబే బాధ్యుడు

 

విజయవాడ: దళిత ఉద్యోగి రవికుమార్‌ ఆత్మహత్యకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఇందుకు చంద్రబాబు బాధ్యత వహించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున అన్నారు. రవి మరణంతోనైనా టీడీపీకి కనువిప్పు కలగాలని ఆయన హెచ్చరించారు. విజయవాడలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం దళితులను అంటరానివారిగా చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రవి ఆత్మహత్యకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. రవి ఒక్కరే కాదని, ఎందరో దళితులు ఈ ప్రభుత్వ పాలనలో విసుగు చెందారన్నారు.  తూర్పు గోదావరి జిల్లాలో ఆవు చర్మం వలిశాడని దళిత వ్యక్తి మోషేను చెట్టుకు కట్టేసి కొట్టారన్నారు. గగరప్రరులో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసేందుకు దళితులు ప్రయత్నిస్తే వారిపై దాడులు జరిగాయన్నారు. ఈ రోజు వరకు కూడా అక్కడ పరిహారం అందకుండా చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రకాశం జిల్లాలో దళితుల భూములను లాక్కొంటే కళ్లు మూసుకున్నారని విమర్శించారు. కర్నూలు జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు వసంతరావును టీడీపీ గుండాలు హతమర్చితే ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. నారావారి పల్లెలో కూడా దళితులపై దాడులు చేయించారన్నారు. దళితులపై ఇన్ని రకాలుగా దాడులు, అసమానతలు జరుగుతుంటే ఎన్ని కేసులకు పరిష్కారం చూపారని నిలదీశారు. 75 శాతం కేసులకు ఇంతవరకు చార్జ్‌షిట్‌ వేయలేదన్నారు. బాబు పాలనలో దళితులకు స్థానం లేదన్నారు. ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి మీరు చేసే తంతు ఇదా అని నిలదీశారు. గతంలో 9 ఏళ్ల చంద్రబాబు పాలనలో కరంచెడు, వేంపెంట వంటి దారుణాలు మళ్లి పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ స్మృతివనం ఏం చేశారని ప్రశ్నించారు. నంది అవార్డుల ప్రధానోత్సవంలో కూడా వివక్ష చూపారని విమర్శించారు. మీరు ఈ రాష్ట్రంలో ఎవరికి సాయం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మీరు చేసే ఆకృత్యాలకు దళితులు బలి అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దళితులారా తస్మాత్‌ జాగ్రత్త..
ఒక ఉద్యోగి రవి బహిరంగంగా ఓ వీడియోలో మరణవాగ్ములం ఇస్తే చంద్రబాబుకు ఎందుకు స్పందించడం లేదని మేరుగు నాగార్జున ప్రశ్నించారు. అధికారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అన్నారు. ఇందుకు చంద్రబాబే మొదటి ముద్దాయి అని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి ఎలా తూట్లు పొడుస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. దళితులకు నిలువ నీడ లేకుండా చంద్రబాబు మోసం చేయబోతున్నారని, తస్మాత్‌ జాగ్రత్త దళితులారా అని హెచ్చరించారు. దళితుల ఏకైక ద్రోహీగా చంద్రబాబు మిగిలిపోతారని విమర్శించారు.
తూతూమంత్రంగా కలెక్టర్‌తో చెప్పించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పడం కంటి తుడుపు చర్య మాత్రమే అన్నారు. రాజ్యాంగబద్ధంగా వచ్చే వాటిని నీవు ఇచ్చేది ఏమీ అని ప్రశ్నించారు. రవి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేరుగు నాగార్జున డిమాండ్‌ చేశారు. ఆ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని కోరారు.
 

తాజా వీడియోలు

Back to Top