స్పీకర్‌కు వైయస్ఆర్‌సీపీ సమైక్య నోటీసు

హైదరాబాద్ :

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సభలో సమైక్య తీర్మానం చేయాలని కోరుతూ సభా నియమావళిలోని 77వ నిబంధన కింద స్పీక‌ర్ నాదెండ్ల మనోహ‌ర్‌కు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గురువారం నోటీ‌సు ఇచ్చింది.‌ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 రాష్ట్రానికి చేరిన నేపథ్యంలో శుక్రవారం శాసనసభలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విభజన బిల్లు అసెంబ్లీకి రాక ముందే సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలంటూ వైయస్ఆర్‌సీపీ తొలి నుంచీ డిమాండ్ చేస్తుండటం, మిగతా పార్టీలు పట్టించుకోకపోవడం తెలిసిందే. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు రోజు స్పీకర్ సమక్షంలో జరిగిన సభా వ్యవహారాల మండలి సమావేశంలో కూడా పార్టీ ఇదే ప్రతిపాదన చేసినా అందులో పాల్గొన్న కాంగ్రెస్, టీడీపీతో సహా ఏ పార్టీలూ స్పందించకపోవడం, దాంతో వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ వాకౌట్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్ర కోసం వై‌యస్ఆర్‌సీపీ స్వయంగా రంగంలోకి దిగింది.

పార్టీ నాయకులు గురువారం నేరుగా స్పీకర్‌ను కలిసి, సమైక్య రాష్ట్రం కోసం తీర్మానం కోరుతూ శాసనసభ నియమావళి 77వ నిబంధన ప్రకారం సభాపతికి నోటీసులు అందజేశారు. అంతే.. ఇప్పటిదాకా సమైక్య తీర్మానం అంశంపై ఒక్క మాటైనా మాట్లాడకుండా మౌనం పాటించిన సీమాంధ్ర కాంగ్రెస్ ప్రతినిధులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉన్నపళాన వెళ్లి స్పీక‌ర్‌ను కలిసి సమైక్య తీర్మానం చేయాలంటూ హడావుడిగా వారు కూడా మరో నోటీసు ఇచ్చారు. తద్వారా విభజన బిల్లు సభకు చేరక ముందే సమైక్య తీర్మానం చేయాలన్న వైయస్ఆర్‌సీపీ బాటలోకి వారు కూడా వచ్చినట్టయింది. విభజన బిల్లు ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీకి చేరిన నేపథ్యంలో సమైక్యం కోసం ఎట్టి పరిస్థితుల్లో తీర్మానం ప్రతిపాదించాలని పార్టీ పట్టుదలతో ఉంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top