10న మండలాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ రైతు దీక్ష

హైదరాబాద్, 8 అక్టోబర్ 2013: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 10వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ’రైతు దీక్ష‘ చేపడుతున్నట్లు పార్టీ రైతు విభాగం కన్వీనర్‌ ఎం.వి.ఎస్. నాగిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే.. మూడు ప్రాంతాలలో ప్రధానంగా వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విభజన కారణంగా కోస్తాంధ్రలోని భూములు ఉప్పునీటి కయ్యలుగా మారిపోయే ప్రమాదం ఉందని, రాయలసీమ ఎడారిగా మారబోతుందన్నారు. వాటితో పాటు తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలు కూడా బీడువారిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ రెండు జిల్లాల్లోనే 70 శాతం పైన ఉన్న వ్యవసాయ పంపుసెట్లు నిరుపయోగం అవుతాయని నాగిరెడ్డి వివరించారు.

రాష్ట్రం రెండు ముక్కలైపోతే అన్నపూర్ణగా భాసిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడి, పొరుగు రాష్ట్రాల మీద మనం ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురవుతుదని నాగిరెడ్డి హెచ్చరించారు. రాష్ట్రం విడిపోతే అంతర్రాష్ట్ర జల వివాదాలు తీవ్రమై, సాగు, తాగునీటి కోసం రైతులు, ప్రజలు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు అంతా నీటి కరవుతో అల్లాడిపోతుందన్నారు. దీనితో పాటు విటిపిఎస్, ఆర్టీపిపి థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల అవసరాలకు కూడా నీరు అందక విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆ ప్రకటనలో నాగిరెడ్డి హెచ్చరించారు.మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో కేవలం 80 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటి వనరులున్నాయని, ఆయన జలయగ్నం ద్వారా చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా కోటిన్నర ఎకరాలకు నీటిని అందివ్వాలని సంకల్పించారన్నారు. తన పదవీ కాలంలోనే 21 లక్షల ఎకరాలకు వైయస్ఆర్‌ సాగునీరు అందించిన వైనాన్ని నాగిరెడ్డి గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగితే.. మెజారిటీ ప్రాజెక్టుల నిర్మాణం నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ రైతు దీక్షలో రైతులు, వ్యవసాయ కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని, నిరాహార దీక్షల ద్వారా నిరసన తెలియజేయాలని నాగిరెడ్డి విన్నవించారు.

Back to Top