చేనేతలకు చేస్తున్న మోసానికి టీడీపీ మూల్యం చెల్లించక తప్పదు

–34వ రోజు చేనేత దీక్షల్లో వైయస్సార్‌సీపీ నాయకులు
ధర్మవరం: చేనేతల ఓట్లతో గెలిచామని చెప్పుకుంటూనే వారిని మోసం చేస్తున్న తెలుగుదేశం పార్టీనాయకులు మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైయస్సార్‌సీపీ నాయకులు కుమారస్వామి, తేజలు అన్నారు. చేనేత ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షలు శనివారం నాటితో 34 రోజుకు చేరాయి. 25వ వార్డు ఇన్‌చార్జ్‌ కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షల్లో వారు మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీకి, నాయకులకు చేనేతలంటే అలుసుగా మారిందన్నారు. చేనేతలకు ప్రతి నెలా ఎంతో కొంత ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతో అప్పట్లో తమ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ముడిపట్టు కొనుగోలుపై ప్రతి నెలా రాయితీగా రూ.600 ఇప్పించారని, జిల్లా వ్యాప్తంగా 35వేల మంది చేనేత కార్మికులకు ప్రయోజనం చేకూరేదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముడిపట్టు రాయితీ చెల్లించకుండా చేనేతలను ఇబ్బందుల పాలు చేస్తోందని విమర్శించారు. ఉన్న సంక్షేమ పథకాలనే ఎత్తివేస్తున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో చేనేతలకు ఇచ్చిన హామీను ఏమాత్రం నెరవేర్చేందుకు సిద్దంగా లేదన్నారు. చేనేతలను ఇంతగా మోసం చేస్తున్న టీడీపీ నాయకులకు అందుకు తగ్గ మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. చేనేతల తరపున పోరాడుతున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

తాజా ఫోటోలు

Back to Top