నిజమైన సమైక్య పోరాటం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌దే

బుట్టాయిగూడెం (ప.గో.జిల్లా) :

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ నిబద్ధత, నిజాయితీతో నిజమైన పోరాటం చేస్తున్నది ఒక్క వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ మాత్రమే అని పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు స్పష్టం చేశారు. రాష్ట్ర సమైక్యత కోసం పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గతంలోనే నిరవధిక నిరాహార దీక్ష చే‌సిన వైనాన్ని, ఇప్పుడు మళ్ళీ శ్రీ జగన్‌ ఆమరణ నిరశన దీక్ష చేస్తుండడాన్ని బాలరాజు ప్రస్తావించారు.

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అధికార పార్టీతో కుమ్మక్కై లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని తెల్లం బాలరాజు ఆవేదన వ్యక్తంచేశారు. పాలకపక్షంతో ప్రతిపక్షం కుమ్మక్కై ప్రజలను మోసం చేసిన సందర్భాలు చరిత్రలోనే లేవని, అందుకు విరుద్ధంగా టిడిపి వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్, టిడిపి ఎత్తుగడలను ముందే గమనించిన వైయస్ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉం‌చాలంటూ ముందుగానే పదవులకు రాజీనామాలు చేసిన వైనాన్ని గుర్తుచేశారు.

చంద్రబాబు నాయుడు సమైక్యవాదో, తెలంగాణవాదో చెప్పకుండా రెండు కళ్ల సిద్ధాంతంతో రెండు ప్రాంతాల ప్రజల చెవిలో పువ్వులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బాలరాజు విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పార్టీలను పక్కనపెట్టి పోరాడదామని చంద్రబాబుకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారని, ఆయన పిలుపునకు స్పందించకపోగా, ఢిల్లీలో ఎందుకు దీక్ష చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. దీక్ష పేరిట ఢిల్లీ బాట పట్టిన బాబు తాను ఇచ్చిన లేఖను ఇకనైనా వెనక్కి తీసుకుని సమైక్యవాదిగా నిరూపించుకోవాలని బాలరాజు అన్నారు.

Back to Top