ఎన్నికలకు వైయస్సార్సీపీ సిద్ధం

  • ప్రజాదరణ ఓర్వలేక వైయస్‌ జగన్‌పై విమర్శలు
  • టీడీపీ అవినీతిపై బహిరంగ చర్చకు మేం రెడీ
  • దేవినేని ఉమా పిచ్చి ప్రేలాపణలు మానుకో
  • వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థులు దొరకరన్న టీడీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి వస్తే..మేం ఎన్నికలకు సిద్ధమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. టీడీపీ నేతలకు దమ్ముంటే ఎన్నికలకు రావాలని ఆయన సవాల్‌ విసిరారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అధికార పార్టీ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌పై మంత్రి దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలను పార్థసారధి తిప్పికొట్టారు. విజయవాడలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్మూ, ధైర్యం లేక టీడీపీ నేతలు కారుకూతలు కూస్తున్నారని ధ్వజమెత్తారు. మీరు చేసే దోపిడీని ప్రశ్నిస్తే వైయస్‌ జగన్‌ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తారా అని నిలదీశారు. 

నరసరావుపేట బహిరంగ సభకు పల్నాడు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని, జన ప్రభంజనాన్ని చూసి టీడీపీ నేతలకు వణుకు మొదలైందన్నారు. జనాలకు డబ్బులిచ్చి మీటింగ్‌లకు తరలించే సంస్కృతి టీడీపీదే అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బందర్‌ పోర్టు నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చాక భూబకాసుల అవతారం ఎత్తారని మండిపడ్డారు. పోర్టు పేరుతో లక్షలాది ఎకరాలను బలవంతంగా లాక్కొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. నీటి పారుదల శాఖలో అంతులేని అవినీతి జరుగుతుందని, ఈ విషయాలను ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ బహిర్గతం చేస్తే..వాటిపై చర్చకు రాకుండా వ్యక్తిగతంగా, వైయస్‌ జగన్‌ను కించపరిచేవిధంగా దేవినేని ఉమా మాట్లాడటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శమన్నారు.

 ఏపీ రాజధాని కోసం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది టీడీపీ నేతలకు గుర్తు లేదా అన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం వద్దని వైయస్‌ జగన్‌ ఏ నాడు చెప్పలేదన్నారు. టీడీపీ నేతల మూలంగా అమరావతిలో జరుగుతున్న అన్యాయాలను, రాజధాని నిర్మాణం పేరుతో చేస్తున్న దోపిడీనే వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకించిందని పార్థసారధి గుర్తు చేశారు. ప్రజలందరికీ రాజధాని అందుబాటులో ఉండేలా మంచి వాతావరణం కల్పించాలని మేం కోరుతున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై బహిరంగ చర్చకు వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉందని, తేది, ప్రాంతం మీరే నిర్ణయించండని సవాల్‌ చేశారు. పులివెందుల, ఫ్యాక్షన్‌ అంటూ రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రజలే టీడీపీ నేతలకు బుద్ధి చెబుతారని పార్థసారధి హెచ్చరించారు.
 
Back to Top