అభివృద్ధి, అవినీతిపై చర్చకు వైయస్సార్‌సీపీ సిద్ధం

––ఒమ్ము, ధైర్యం ఉంటే మీ నాయకుడు ఎక్కడి నుండి పోటీచేస్తాడో ప్రకటించండి
––సవాల్‌ విసిరిన వైయస్సార్‌సీపీ నాయకులు

నరసరావుపేటః గడిచిన మూడేళ్ళల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నరసరావుపేటలో చేసిన అభివృద్ది, అవినీతిపై వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ చర్చకు సిద్ధంగా ఉందని ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. దమ్ము, ధైర్యం ఉంటే టీడీపీ నాయకులు చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఈ మూడేళ్ళల్లో కేవలం అవినీతే మాత్రమే జరిగిందని, అభివృద్ది ఎక్కడా చోటుచేసుకోలేదని స్పష్టంచేశారు. పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎస్‌.ఏ.హనీప్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం విజయవంతం కావటంతో కళ్ళు బైర్లు కమ్మి మతిపోయి ఈర్ష్య, అసూయా ధ్వేషాలతో ఎమ్మెల్యేపై విమర్శలకు దిగారన్నారు. రాష్ట్రంలో రుణమాఫీపై మాట్లాడే నైతిక హక్కు ఒక్క తమ పార్టీకే ఉందని హనీఫ్‌ చెప్పారు. దివంగత వైయస్సార్‌ సమర్ధవంతంగా రుణమాఫీ అమలుచేసి రైతుకు మేలుచేసి చూపించారని టీడీపీ నాయకులకు గుర్తుచేశారు.టీడీపీ ప్రభుత్వం నిబందనలు పెట్టి రుణమాఫీ పూర్తిగా అమలుచేయకుండా రైతులు బ్యాంకుల్లో మళ్ళీ రుణం తీసుకునే అవకాశం లేకుండా చేసిందన్నారు. పట్టిసీమను 11 నెలల్లో పూర్తిచేశామని చెప్పుకోవటం టీడీపీ నాయకుల దివాణాకోరు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. వైఎస్సార్‌ సీఎంగా ఉండగా అష్టకష్టాలు పడి కేంద్ర ప్రభుత్వం నుంచి 11అనుమతులు తీసుకొచ్చి కాలువల నిర్మాణం చేస్తే, కేవలం రూ.250కోట్ల కమిషన్‌ కోసం వైఎస్సార్‌ త్రవ్వించిన కాలువల అండతో పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను చేపట్టారని దుయ్యబట్టారు. రిజర్వాయర్‌లేకుండా నిర్మించిన పట్టిసీమ వలన ఎవరికీ ఉపయోగంలేదన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డికి చెందిన సుష్మిత ఆర్ద్రో ట్రామాకేర్‌ వైద్యశాలకు టీడీపీ ప్రభుత్వంలోనె ఆరోగ్యశ్రీ మంజూరైందన్నారు. ఒక్క ఏడాదిలోనె ఎమ్మెల్యే 960 ఆపరేషన్లు చేయటంతో బిల్లులు కూడా మంజూరయ్యాయన్నారు. దీనిపై కన్నుకుట్టి ఆర్దిక మూలాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆరోగ్యశ్రీని రద్దుచేయించారని ఆరోపించారు. రెండేళ్ళక్రితం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్న రేషన్‌ బియ్యం రాకెట్‌ను ఎమ్మెల్యే చేధించి 2వేల బ్యాగుల రేషన్‌ బియ్యాన్ని అధికారులకు పట్టిస్తే ఇప్పటివరకు దానిపై కనీసం కేసు, చర్యలు లేవు అన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి ఎల్లప్పుడూ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటుండటంతో ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారన్నారు. దీనిపైనే వచ్చే ఎన్నికల్లో తనకు 20వేలకు పైగా మెజార్టీ వస్తుందని ఎమ్మెల్యే ఆత్మవిశ్వాసంతో చెప్పారన్నారు. ఇప్పటివరకు మీ నాయకుడు ఎక్కడి నుండిపోటీచేస్తాడో స్పష్టంచేయలేకపోయారని, ధైర్యం ఉంటే ప్రకటించాలని హనీఫ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి కందుల ఎజ్రా మాట్లాడుతూ ఎమ్మెల్యేపై చౌకబారు విమర్శలు మానుకోవాలని, ఎస్సీలు అందరమూ వైఎస్సార్‌సీపీకి అండగా ఉంటామని చెప్పారు. సమావేశంలో రొంపిచర్ల మండల పార్టీ నాయకుడు పచ్చవ రవీంధ్ర, ఎమ్మెల్యే అధికార ప్రతినిధి వల్లెపు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Back to Top