స్టీల్‌ ప్లాంట్‌ను అడ్డుకుంది చంద్రబాబే


– వైయస్‌ఆర్‌సీపీ రాయలసీమ ఇన్‌చార్జ్‌ సజ్జల రామకృష్ణారెడ్డి
– రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి 48 గంటల దీక్ష విరమణ
 
వైయస్‌ఆర్‌ జిల్లా:  జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తలపెట్టిన స్టీల్‌ ప్లాంట్‌ను అడ్డుకుంది చంద్రబాబే అని వైయస్‌ఆర్‌సీపీ రాయలసీమ ఇన్‌చార్జ్‌ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇప్పుడు స్టీల్‌ప్లాంట్‌ కోసం చంద్రబాబు మొసలి కన్నీరు కార్చుతున్నారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.  ఉక్కు పరిశ్రమ స్థాపనకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేపట్టిన 48 గంటల దీక్ష ముగిసింది. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి వయస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి, వైయస్‌ఆర్‌సీపీ రాయలసీమ ఇన్‌చార్జ్‌ సజ్జల రామకృష్ణారెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. రాచమల్లు దీక్ష నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైయస్‌ఆర్‌సీపీ నేతలు సజ్జల, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషా, సురేష్‌బాబు, అమర్నాథ్‌రెడ్డిలు పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఉక్కు పరిశ్రమ కోసం జిల్లాలోని ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తామని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రాజీనామాకు సిద్ధమా అని ఆయన సవాలు విసిరారు. టీడీపీతో రాజీనామాలు చేయించే బాధ్యత అఖిలపక్షం తీసుకోవాలని రాచమల్లు కోరారు. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ రాకపోవడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని, స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఎందాకైనా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. నాలుగేళ్ల నుంచి మాట్లాడని టీడీపీ ఇప్పుడు దీక్షలు చేయడంలో అర్థమేంటి అన్నారు. కేవలం ఓట్ల కోసమే టీడీపీ మొసలి కన్నీరు కారుస్తుందని విమర్శించారు. 
 
Back to Top