సాగునీటి కోసం వైఎస్సార్సీపీ పోరుబాట

పశ్చిమగోదావరిః రబీకి  పూర్తిస్థాయిలో సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టాలని నిర్ణయించింది.  ఈక్రమంలోనే పాలకొల్లులో ఈ నెల 30న డెల్టాకు చెందిన రైతులతో కలిసి నిరసన తెలపనున్నారు. ఇదే అంశంపై పూలపల్లిలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి, ఇతర ముఖ్యనేతలు సమావేశమయ్యారు.
 
ప్రసాదరాజు మాట్లాడుతూ...పట్టిసీమ ప్రాజెక్టు వల్ల కలిగే దుష్పరిణామాలను నిర్మాణం తలపెట్టిన రోజునే ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గొంతెత్తి చాటారని, అయితే జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం నోరుమెదపలేదని దుయ్యబట్టారు. గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం వల్లే ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీటి కష్టాలు ఎదురయ్యాయన్నారు. సాగునీరు ఇవ్వలేమని తెలిసినా కూడా...టీడీపీ ఎమ్మెల్యేలు సాగునీరు అందిస్తామని రైతుల్ని మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఎమ్మెల్సీ శేషుబాబు మాట్లాడుతూ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనా, నాయకులపైనా కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షమంటే ప్రజల గొంతు వినిపించేదని చాటిచెప్పారు. సమస్యల్ని పరిష్కరించకపోగా ప్రజాధనాన్ని ఏవిధంగా దోచుకోవాలన్న విధంగా  అధికార పార్టీ నేతలు ఆలోచిస్తున్నారన్నారని ఫైరయ్యారు. మునిసిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ, నడపన సత్యనారాయణ, మైలాబత్తుల మైఖేల్‌రాజు గుంటూరి పెద్దిరాజు, పొత్తూరి బుచ్చిరాజు, బోనం బులివెంకన్న, గుణ్ణం సర్వారావు, కైలా నరసింహరావు, బి.నాగరాజు ఈభేటీలో పాల్గొన్నారు.
Back to Top