'భూ సేకరణకు వ్యతిరేకంగా జాతీయస్థాయి ఉద్యమం'

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రైతుల నుంచి అన్యాయంగా భూములు లాక్కుంటున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు.  ఇందులో భాగంగా రాజధాని నిర్మాణం పేరిటసారవంతమైన భూములు లాక్కునే కార్యక్రమానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఒత్తిడి తెచ్చేలా వివిధ పార్టీలు, సంఘాలను కలవనున్నామన్నారు. భూ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా జంతర్‌మంతర్ వద్ద గాంధేయవాది అన్నా హజారే చేపట్టిన ధర్నాకు వైఎస్సార్ సీపీ, ఏపీ రాజధాని ప్రాంత రైతు, రైతు కూలీల పరిరక్షణ వేదిక మద్దతు తెలిపింది. ఏపీలో వందకుపైగా పంటలకు సంబంధించిన ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబు, ఏపీ ప్రాంత రైతులు, రైతు కూలీల పరిరక్షణ వేదిక ప్రతినిధులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. తుళ్లూరు ప్రాంతానికి చెందిన రైతులను ప్రభుత్వం భయాందోళనలకు గురిచేస్తోందని తెలిపారు. రాజధాని నిర్మాణం తప్పు కాదని, అందుకు లక్ష ఎకరాల కావాలా? అని ప్రశ్నించారు.

అన్నా, మేథా పాట్కర్‌కు వినతిపత్రం
రాజధాని నిర్మాణం పేరిట టీడీపీ ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాల నుంచి రైతులను కాపాడాలని కోరుతూ వైఎస్సార్ సీపీ, ఏపీ రాజధాని ప్రాంత రైతు, రైతు కూలీల పరిరక్షణ వేదిక పతినిధులు గాంధేయవాది అన్నాహజారే, సామాజిక ఉద్యమకారిణి మేథాపాట్కర్‌లకు వినతి పత్రం అందజేశారు. బహుళ పంటలు సాగవుతున్న ఏపీలోని పంటలను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రాంత రైతులు, రైతు కూలీల పరిరక్షణ వేదిక ప్రతినిధులు అంబటి రాంబాబు (వైఎస్సార్ సీపీ), వి.లక్ష్మణరెడ్డి ( జన చైతన్య వేదిక), కె. విజయకుమార్ ( కాంగ్రెస్), బి. రామకృష్ణరాజు (ఆప్ ఏపీ కార్యదర్శి), కిరణ్ (ఆప్ నేత), శ్రీనాథ్ చౌదరి (రైతు) పాల్గొన్నారు.
Back to Top