16 నుంచి వరంగల్ లో వైఎస్ జగన్ ప్రచారం..!

పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహం..!
వైఎస్సార్సీపీతోనే అభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్న ప్రజలు..!

వరంగల్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వరంగల్ ఉపఎన్నికల ప్రచారానికి సర్వం సిద్ధమైంది. వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా ఈనెల 16 నుంచి 19 వరకు వైఎస్ జగన్ ఓరుగల్లులో ప్రచారం నిర్వహిస్తారు. నాలుగు రోజుల పాటు జననేత వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ, స్టేషన్ ఘన్పూర్, తొర్రూర్, పరకాల బహిరంగ సభల్లో వైఎస్ జగన్ ప్రసంగిస్తారని  పొంగులేటి ప్రకటించారు. దీంతో, పార్టీ శ్రేణులు ఆనందోత్సాహంతో ఉన్నారు. 

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయని వరంగల్ లో జరిగిన మీడియా సమావేశంలో పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన ఏకైక నాయకుడు వైయస్. రాజశేఖర్ రెడ్డి అని, అందువల్లే ఆమహానేత చనిపోయి ఆరుసంవత్సరాలయినా ప్రతిఒక్కరి గుండెలో చిరస్థాయిగా నిలిచారన్నారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే అది మళ్లీ రాజన్న రాజ్యంతోనే సాధ్యమని ప్రజలంతా విశ్వసిస్తున్నారని పొంగులేటి తెలిపారు.

ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చని టీఆర్ఎస్, టీడీపీ-బీజేపీ, కాంగ్రెస్ లను చిత్తుగా ఓడించాలని పొంగులేటి వరంగల్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ... దళితుల తరుపున దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని  ప్రజలను విజ్ఞప్తి చేశారు. 
Back to Top