వైఎస్సార్సీపీకి ప్రజల దీవెనలు..!

టీఆర్ఎస్,కాంగ్రెస్,టీడీపీ-బీజేపీలకు దూరంగా ప్రజలు..!
హామీలు విస్మరించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు...!

వరంగల్ః ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీలు పూర్తిగా వైఫల్యం చెందాయని ..తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం ...సంక్షేమ పథకాలను పూర్తిగా విస్మరించాయని మండిపడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ-బీజేపీ అభ్యర్థులకు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. రాజన్న కుమారుడు, తమ అధ్యక్షులు వైఎస్ జగన్ కు వరంగల్ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి..విలువలు, విశ్వసనీయత గల వైఎస్సార్సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

వైఎస్సార్సీపీ గెలుపు తథ్యం..!
ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందించి భరోసా కల్పించిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని పొంగులేటి  స్పష్టం చేశారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి దళితులు, వృద్ధులు, మైనారిటీలు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చారన్నారు. దేశంలోనే ఏ ప్రభుత్వం చేయనంతగా రాజశేఖర్ రెడ్డి మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు 26 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తే..ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 47 లక్షల పక్కా గృహాలు కట్టించిన ఘనత వైఎస్ . రాజశేఖర్ రెడ్డి అని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ లు తుంగలో తొక్కాయన్నారు. 

కేసీఆర్ దగా పాలన..!
టీఆర్ఎస్ కు పట్టం కడితే దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ వారిని మోసగించారని దుయ్యబట్టారు. రుణల మాఫీగానీ  , గిట్టుబాటు ధర కల్పించడంలో గానీ అన్ని విధాలుగా రైతులను మోసం చేశారన్నారు. వైఎస్సార్ గిరిజనుల భూములకు హక్కుదారు పత్రాలు ఇస్తే, వారిని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. రూ. 70 ఉన్న పెన్షన్ ను 60 సంవత్సరాలు దాటిన అర్హులైన అందరికీ రాజశేఖర్ రెడ్డి రూ. 200 ఇచ్చారని గుర్తు చేశారు. నేడు టీఆర్ఎస్ లబ్దిదారులకు పెన్షన్ ఇవ్వడంలో ఆంక్షలు పెడుతూ కోత  విధిస్తుందన్నారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి వారిని కేసీఆర్ దగా చేశారని నిప్పులు చెరిగారు.  

రూ.15 కూడా ఇవ్వలేకపోయాడు..!
అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లధనాన్ని స్వదేశానికి రప్పించి... భారతదేశంలోని ప్రతి పౌరుడి అకౌంట్ లో రూ. 15 లక్షలు వేస్తామన్న మోడీ ..రూ. 15 రూపాయలు కూడా వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందన్నారు. ప్రజల దీవెనలతో రాబోయే రోజుల్లో తెలంగాణలో వైఎస్సార్సీపీ ఉన్నతస్థానంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో టీడీపీ-బీజేపీలు,  టీఆర్ఎస్ తో ఏవిధంగా చెట్టాపట్టాలేసుకొని తిరిగాయో ప్రజలంతా చూశారన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్సార్సీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని పొంగులేటి వరంగల్ ఓటర్లను కోరారు.
Back to Top