బహిరంగ సవాల్‌

రెండేళ్లలో బాబు 1.5
లక్షల కోట్లు
దోపిడీ

గతంలోనే ఆధారాలతో సహా బయట పెట్టిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌

మళ్లీ అసత్య ప్రచారాలకు తెరతీసిన టీడీపీ

దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ 

‘‘పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా
కనిపిస్తుంది’’
అన్నది ఎంత
వాస్తవమో.. పచ్చపార్టీ నేతలకు అందరూ తమ మాదిరే దొంగలుగానే కనిపిస్తున్నారన్నది
కూడా అంతేవాస్తవం. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి లక్షల కోట్లు వెనకేసుకుంటూ ఆ
అవినీతి బురదను  పక్కవాళ్లపై చల్లుతూ రాక్షసానందం పొందుతున్నారు బాబు అండ్‌
కో. తాము నిప్పు అని,
అవినీతికి ఆమడ
దూరమని చెప్పుకునే ఆ పచ్చ పార్టీ నేతల  భాగోతాలు ప్రతిపక్ష వైయస్‌ఆర్‌
కాంగ్రెస్‌ ఇప్పటికే పలుమార్లు సాక్ష్యాధారాలతో బయట పెట్టింది. అయినా సిగ్గు లేని
ఆ నేతలు  ఇంకా ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ
నేపథ్యంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మరోసారి తెలుగుదేశం పార్టీకి బహిరంగ
సవాల్‌ విసిరారు. దమ్మూ ధైర్యం ఉంటే ఈ సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌
చేస్తున్నారు. 

 

ఒక అబద్ధం వందసార్లు చెబితే నిజం అవుతుందన్నది పచ్చపార్టీ నేతల నమ్మకం. అందులో
భాగంగానే కాకుల మాదిరి గోల చేస్తున్నారు. అయితే ఎన్నిసార్లు  కాకిగోల
చేసినా.. అది  కోకిల స్వరం అవుతుందా? కనీసం ఈ మాత్రం జ్ఞానం కూడా లేకుండా వైయస్‌ఆర్‌
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌పై నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. 

 

అసత్య ప్రచారాలతో పబ్బం..

అసత్య ప్రచారం చేయడంలో బాబును మించిన వారు ఈ భూ ప్రపంచంలో లేరంటే అతిశయోక్తి
కాదు. అబద్ధాన్ని పదే పదే చెప్పి  నిజం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు
చేస్తుంటారు. బాబు బాటలోనే ఆ పార్టీ నాయకులు కూడా వెళ్తున్నారు. అవినీతి..
అక్రమాలు వాళ్లు చేస్తూ నిందలు మాత్రం వేరేవాళ్లపైకి నెడుతున్నారు. తాజాగా ఏపీ
ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌పై చంద్రబాబు మరో ఆరోపణ చేశారు. ఒకరు నల్లధనాన్ని
తెల్లధనంగా మార్చుకున్నారని చంద్రబాబు పరోక్షంగా జగన్‌పై ఆరోపణలు చేశారు. అంతే
 మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కూడా  విపక్షనేత జగన్‌పై ఆరోపణలు
గుప్పించారు. హైదరాబాద్‌ నుంచి ప్రకటించిన నల్లధనం వెల్లడిలో రూ.10 వేల కోట్లు జగన్‌ మోహన్‌ రెడ్డివే అని
సెలవిచ్చారు. 

 

బాబు.. వీటికి సమాధానం చెప్పు?

ఒకరిపై వేలు చూపించే ముందు నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తుంటాయన్నది బాబుకు
తెలియంది కాదు. అయినా కూడా తాను తప్పులు చేస్తూ.. వేరేవాళ్లపై నిందలు వేస్తుంటారు.
పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి రాగానే
రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేశారు. సింగపూర్, జపాన్‌ దేశాలకు తాకట్టు పెట్టి లక్షల కోట్లు
దోచుకున్నారు. బాబు ఆయన అనుయాయులు ఎక్కడెక్కడ ఎంతెంత దోచుకున్నదానిపై ఆధారాలతో సహా
 వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ‘‘చంద్రబాబు ఎంపరర్‌ ఆఫ్‌ కరెప్షన్‌’’ పేరుతో పుస్తకాన్ని ముద్రించింది. ఇవన్నీ
నిజాలు కాదా అని అధికార టీడీపీని ప్రశ్నిస్తే పచ్చపార్టీ నేతల నుంచి సమాధానం లేదు.
భూ దందా.. ఇసుక దందా.. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌.. కల్తీ మందు.. కల్తీ విత్తనాలు..
పట్టిసీమ.. పుష్కరాలు.. శంకుస్థాపనలు కార్యక్రమాలు  నిర్వహించి వేల కోట్లు
వెనకేసుకున్నది వాస్తవం కాదా? అంటే మాత్రం నోరు మెదపరు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు పచ్చపార్టీ నేతలు చేసే
అవినీతి అక్రమాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ బయట పడిపోతున్నాయన్న భయంతో
 ప్రతిపక్షనేతపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. 

 

దమ్ముంటే సవాల్‌ను స్వీకరించండి..

తెలుగుదేశం పార్టీ నేతలు చేసే ఆరోపణలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సవాల్‌
విసిరింది. ఇప్పటికే చాలా సార్లు సవాల్‌ విసిరామని.. మళ్లీ ఒకసారి సవాల్‌
విసురుతున్నామని,  దమ్ముంటే ఆ సవాల్‌ను
స్వీకరించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. చంద్రబాబు ఎంత
దోచుకున్నది తాము భయపెట్టేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. తమ నాయకుడు జగన్‌పై
లేనిపోని ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవడం కాదని, దమ్ముంటే బహిరంగ సవాల్‌కు సిద్ధం కావాలని
డిమాండ్‌ చేస్తోంది. కాగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌
మోహన్‌ రెడ్డి కూడా గతంలో టీడీపీ నేతలకు పలుమార్లు సవాల్‌ విసిరారు. సాక్షాత్తు
అసెంబ్లీ వేదికగా చంద్రబాబు చేసిన ఆరోపణలపై జగన్‌ స్పందిస్తూ ‘‘నేను అక్రమంగా వేల కోట్లు సంపాదించానని
చంద్రబాబు అంటున్నారు. మీరు చెప్పే మొత్తంలో పావల భాగం నాకు ఇచ్చి మిగతాదంతా మీరే
తీసుకోండి. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతా’’ అని  కూడా అన్నారు. అంతేకాదు ఇలాగే
ఊరుకుంటే  రేపో..మాపో అసెంబ్లీ కూడా తనదే అని కూడా అంటారని చెప్పడం
తెలిసిందే. 

 

ఇది తప్పును ఒప్పుకున్నట్లు కాదా?

నిజం నిప్పులాంటిదని మరోసారి రుజువైంది. తెలుగుదేశం పార్టీ నేతలు చేసే
ఆరోపణల్లో వాస్తవం లేదని తేటతెల్లమైంది. గతంలో జగన్‌ లక్ష కోట్లు సంపాదించారని
చెప్పిన పచ్చపార్టీ నేతలు ఇప్పుడు మాట మార్చారు. మొన్నటి వరకు లక్ష కోట్లు అని
ఆరోపణలు చేసిన తెలుగుతమ్ముళ్లు ఆ తర్వాత  రూ. 60వేల కోట్లకు వచ్చి అసెంబ్లీలో రూ.40వేలు కోట్లు  అని చెప్పింది తెలిసిందే.
అయితే తాజాగా జగన్‌ అక్రమంగా రూ. 10వేల కోట్లు  సంపాదించారని
చెబుతుండడాన్ని బట్టి చూస్తే టీడీపీ నాయకులు కావాలనే జగన్‌పై ఆరోపణలు
చేస్తున్నారని అర్థమవుతోంది. టీడీపీ నాయకుల వ్యాఖ్యలు ప్రజలందరినీ ఆలోచింపజేస్తున్నాయనడంలో
ఎలాంటి సందేహం లేదు. 

 

Back to Top