కార్పొరేషన్ స్కూళ్లలో కార్పొరేట్ విద్య

హైదరాబాద్: పేదలకు సైతం కార్పొరేట్ విద్య అందించాలనే సంకల్పంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్సార్(కడప) కార్పొరేషన్ మేయర్, వైఎస్సార్ సీపీ నేత కె. సురేష్‌బాబు.  కార్పొరేషన్ స్కూళ్లలోనూ కార్పొరేట్ తరహా ఆంగ్ల మాధ్యమ విద్యను అందించాలని ఆయన సంకల్పించారు. ఈ క్రమంలో సురేష్‌బాబు ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 45 స్కూళ్లు ఉన్నాయని, వాటిలో స్లమ్ ఏరియాలోని 25 స్కూళ్లల్లో జూన్ నుంచి ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభించనున్నట్టు చెప్పారు.

ఆయా స్కూళ్లలో కార్పొరేట్ తరహా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అమెరికా ఎన్‌ఆర్‌ఐ కమిటీ రూ. 2,50,116 చెక్కును వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో తమకు అందజేయడం అభినందనీయమని కొనియాడారు. సురేష్ బాబు ఆలోచనలకు తోడ్పాటు అందించేందుకు తాము సిద్ధమని వైఎస్సార్ సీపీ అమెరికా ఎన్‌ఆర్‌ఐ కమిటీ కన్వీనర్ పండుకాయల రత్నాకర్ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, కార్యదర్శి చల్లా మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
Back to Top