మాఫియా ప్రభుత్వంగా మారిన చంద్రబాబు ప్రభుత్వంఅధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఏ ఒక్క హామీ నెరవేర్చని టీడీపీప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం
హైదరాబాద్: టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా... ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చిన పాపాన పోలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని ఆరోపించారు. పేద రైతుల నుంచి టీడీపీ నేతలు రాజధాని ప్రాంతంలో భూములు లాక్కొన్నారని ఫైరయ్యారు. అన్ని విధాలుగా విఫలమైన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టినట్లు ఆయన వివరించారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఏ ఒక్క కుటుంబంలోని యువకుడికి ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవని, కనీసం ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి అందినట్లు ఎక్కడ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టి, అధికారంలోకి వచ్చిన టీడీపీ... ప్రజల శ్రేయస్సు మరచి భూదందా గురుంచి ఆలోచిస్తుందని విమర్శించారు.
అవినీతి అక్రమాలకు అడ్డాగా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం మాఫియా ప్రభుత్వంగా మారిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కరరెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుకమాఫీయా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, రాజధాని నిర్మాణంలో అక్రమాలకు పాల్పడడమే చంద్రబాబు సర్కారు విధానమని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందని ఆయన మండిపడ్డారు. ప్రజల శ్రేయస్సు మేరకే తాము అవిశ్వాస తీర్మానం ఇచ్చినట్లు భాస్కరరెడ్డి చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో ఏపీ ప్రభుత్వ మోసాలను ఎండగడతామని తెలిపారు. రాజధాని పేరిట లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ...పది నుంచి 30 కోట్లతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోనేందుకు ప్రలోభపెడుతున్నారని ధ్వజమెత్తారు. విప్ ధిక్కరించే ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని, ఎవరు ఎవరి పక్షాన ఉంటారో తేలిపోతుందని చెవిరెడ్డి అన్నారు.