ఒక్క హామీనీ అమలు చేయని చంద్రబాబు

‌హైదరాబాద్ :

రాష్ట్ర ప్రజలకు‌ గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారేమో చెప్పాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ రైతు విభాగం కన్వీన‌ర్ ఎంవీఎస్ నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై చర్చకు రావాలని ఆయన సవాల్ ‌చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.

‌1999 ఎన్నికల ప్రణాళికతో పాటు చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు చేసిన ఏ ఒక్క వాగ్దానాన్నైనా అమలు చేశారేమో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నపుడు రైతులు, ప్రజల సంక్షేమానికి ఒక్క పథకమైనా చేపట్టని చంద్రబాబు ఇప్పుడు అన్నీ మాఫీ చేస్తానని హామీలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు మాటలు చూస్తూంటే ‘నేను మాత్రమే ప్రజలను మోసం చేయగలను’ అనే విశ్వాసంతో ఉన్నారని నాగిరెడ్డి ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం గిట్టుబాటు కాక, అప్పులు తీర్చలేక రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలేదని నాగిరెడ్డి దుయ్యబట్టారు. ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని రైతు సంఘం ప్రతినిధులు కోరినప్పుడు పరిహారం ఇస్తే రైతులింకా ఆత్మహత్యలు చేసుకుంటారని చంద్రబాబు ఎగతాళి చేశారన్నారు. బిందు సేద్యంపై రైతులకు ఇస్తున్న 50 శాతం సబ్సిడీ చాలదని 75 శాతానికి పెంచాలని రైతు ప్రతినిధులు కోరితే... 50 శాతం భరించలేని రైతులకు అసలు సబ్సిడీనే ఇవ్వొద్దని చెప్పిన ఘనత చంద్రబాబుది అన్నారు. అలాంటి చంద్రబాబు ఇపుడు 90 శాతం సబ్సిడీ ఇస్తానని చెబితే ఎలా నమ్మగలం? అన్నారు.

2002 మార్చిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20,71, 642 ఉద్యోగాలుండగా 2004లో ఆయన దిగిపోయే నాటికి 20,11,645 మాత్రమే మిగిలాయి. చంద్రబాబు సీఎంగా దిగిపోయే నాటికి రాష్ట్రంలో అతి తక్కువగా 105 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరగ్గా, మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నపుడు 204 టన్నులు అత్యధికంగా ఉత్పత్తి జరిగిందని చెప్పారు.

Back to Top