ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారం

‌మండి (హిమాచల్‌ప్రదేశ్),

10 జూన్ 2014: బియాస్ నది దుర్ఘటనలో మరణించిన‌ విద్యార్థుల మృతదేహాలను వెలికి తీసేందుకు చేస్తున్న సహాయక చర్యలు అవసరమైనంత మేరకు వేగంగా జరగడం లేదని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. హిమాచ‌ల్‌ ప్రదేశ్లోని పండో రిజర్వాయ‌ర్ వద్ద ఆ రాష్ట్ర ప్రభుత్వం‌ మంగళవారం చేపట్టిన సహాయక చర్యలను పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పి. మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఆ తరువాత వారు మీడియాతో మాట్లాడారు. నది నీటిలో గల్లంతయిన విద్యార్థులను వెలికి తీయడానికి సహాయక బృందాలను పెంచాలని వైయస్ఆర్‌సీపీ ఎంపీలు హిమాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.‌ ఈ ప్రమాదంలో మృతి చెందిన ఒక్కో విద్యార్థి కుటుంబానికి రూ. 20 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.

బియాస్‌ నది నీటిలో విద్యార్థులు కొట్టుకుపోయి 40 గంటలు గడిచినా ఇప్పటి వరకు వారి మృతదేహాలను వెలికి తీయలేకపోయిన ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆలసత్వంపై పార్టీ ఎంపీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు నీట మునిగి గల్లం‌తయిపోయినా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల స్పందన మాత్రం నామమాత్రంగా‌నే ఉందని వారు ఆరోపించారు. విద్యార్థుల మృతదేహాలను వెలికి తీసేందుకు అధునాతన పరికరాలను వినియోగించి గాలింపు చర్యలు చేపట్టాలని ఎంపీలు సుబ్బారెడ్డి, మిథున్రెడ్డి, పొంగులేటి శ్రీనివా‌స్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.

అనంతరం ఈ ముగ్గురు ఎంపీలూ మండి జిల్లా కలెక్టర్ను కలుసుకున్నారు. విద్యార్థుల ఆచూకీ కోసం సహాయక చర్యలు వేగవంతం చేయాలని ‌కలెక్టర్కు వారు విజ్ఞప్తి చేశారు. దుర్ఘటన ఆదివారం జరిగినా ఇప్పటి వరకు విద్యార్థులను గుర్తించకపోవడంపై కలెక్టర్ ముందే ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.‌

అంతకు ముందు.. బియాస్‌ నదిలో గల్లంతైన విద్యార్థుల కుటుంబాలకు సహాయం అందించేందుకు వైయస్ఆర్‌సీపీ ఎంపీల బృందం మంగళవారం కులుమనాలి వెళ్లింది. పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కులుమనాలి వెళ్లారు. బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం సాగుతున్న సహాయక చర్యలను వారు పరిశీలించారు.

బియాస్‌ నదిలో విద్యార్థులు గల్లంతయిన ఘటనపై వైయస్ఆర్‌సీపీ ఎంపీల బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు తమ పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.

Back to Top