నేడు స్పీక‌ర్‌ను క‌లువ‌నున్న ఎంపీలు

- రాజీనామాల ఆమోదానికే మొగ్గు
 
అమ‌రావ‌తి:  ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతూనే ఉంది. హోదా సాధ‌న‌కు గ‌త నెల‌లో త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ఇవాళ సాయంత్రం లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌ను క‌లువ‌నున్నారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి ఇస్తామన్న ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌క‌పోవ‌డంతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లుగా పోరాడుతూనే ఉంది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్య‌మించారు. ఈ క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన‌ ఎంపీలు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్‌, వైయ‌స్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి లు పార్ల‌మెంట్ స‌మావేశాల చివ‌రి రోజు త‌మ  ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌లు చేప‌ట్టారు. ఇప్పటివరకు తమ రాజీనామాలను స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆమోదించలేదు. కాగా వారి రాజీనామాల విషయమై స్పీకర్ ఆ ఎంపిలను ఈ నెల 29న ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వవలసిందిగా కోరారు. వాస్తవానికి తమ రాజీనామాలపై ఇప్పటివరకు నిర్ణయం ఎందుకు తీసుకోలేదు, ఆమోదం ఎందుకు తెలుపలేదు అని ఇదివరకే వారు స్పీకర్ ను సంప్రదించడంతో ఆమె మే 1న, ఆ తరువాత మే 7 వారిని కలిసేందుకు సమయం కేటాయించ‌లేదు. అయితే పలు కారణాల వల్ల  కలవలేకపోయిన స్పీక‌ర్ చివరిగా ఈనెల 29న ఢిల్లీ వచ్చి కలవాలని స్పీకర్ వారికి విడివిడిగా లేఖలను పంపించారు. స్పీకర్ ఎన్ని చెప్పినప్పటికీ ఎట్టిపరిస్థితుల్లో తమ రాజీనామాలను ఆమోదింప చేసుకుంటామని, తాము ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వర ప్రసాద్, మిదున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా ప్రత్యేక హోదా తేవాలని తమ అధినేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి మొదటినుండి ఎంతో పట్టుదలతో వున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాలకోసం ఏపీని కేంద్రానికి తాకట్టుపెట్టి తమ పబ్బం గడుపుకుంటున్నారని వారు విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ తాము ఢిల్లీ వెళ్లి రాజీనామాల ఆమోదం తర్వాత తిరిగి జరిగే ఉప ఎన్నికల్లో మళ్ళి తమ చిత్తశుద్ధి ఏమిటో నిరూపించుకుంటామని, ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేదిలేదని అన్నారు. 
Back to Top