పోరాటం ఉద్ధృతం న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన హామీల అమలుపై వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. మూడో రోజు కూడా వైయ‌స్‌ఆర్‌ సీపీ ఎంపీలు పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదాతో, రాష్ట్రానికి న్యాయం చేయలంటూ ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, మిధున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు మాట్లాడుతూ విభజన హామీల అమలుకు  తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం డ్రామాలు ఆడుతోందన్నారు. చంద్రబాబు నాయుడు డబుల్‌ గేమ్‌ ఆడుతున్నారని, మంత్రివర్గంలో ఉంటూ నిరసనలు చేయడం ప్రజలను మభ్యపెట్టడమే అని మండిపడ్డారు. బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకూ నిరసన కొనసాగిస్తామని అన్నారు. ఏపీలో బంద్‌ను విఫలం చేసేందుకు అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి నివాసంలో పార్టీ ఎంపీలు ఇవాళ ఉదయం సమావేశమై కార్యచరణపై చర్చించారు.


Back to Top