నియోజకవర్గాల అభివృద్ధికి ఎంపీల కృషి

న్యూఢిల్లీ, 10 జూన్ 2014:

సార్వత్రిక ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. కేంద్రంలో, రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజకీయాలను పక్కనపెట్టి అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. పార్టీ ఎంపీలు మంగళవారంనాడు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుసుకుని, తమ తమ నియోజకవర్గ సమస్యలు వివరిస్తూ బిజీబిజీగా గడిపారు. ఎంపీలు అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ను కలిశారు. గ‌ల్ఫు బాధితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. గల్ఫు దేశాల్లో చనిపోతున్న భారతీయుల మృతదేహాలను వెంటనే మన దేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. గల్ఫు బాధితుల సమస్యల పరిష్కారం కోసం  టోల్‌ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను పార్టీ ఎంపీలు కోరారు.

వైయస్ఆర్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడను కలిశారు. తమ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని కోరారు. కాచిగూడ - గుంతకల్ డబు‌ల్ ‌డెక్కర్ రైలును ఒంగోలు వరకు పొడిగించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. ప్రస్తుతం భద్రాచలం - మణుగూరు రైల్వే లై‌న్‌ను త్వరగా పూర్తిచేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.

Back to Top