కొత్త చక్రాలు వెతుకునేందుకు ఢిల్లీకి బాబు

చంద్రబాబుది ఒక డ్రామా కంపెనీ
స్వార్థ ప్రయోజనాలకు రాష్ట్రం అడ్డం పెడుతున్న టీడీపీ
బాబు తన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ వేసుకోవాలి
హోదా రాష్ట్ర ఊపిరి, దాన్ని కాపాడుకోవడం కోసం పోరాడుతాం
కేంద్ర వైఖరిని నిరసిస్తూ రాజీనామాలు చేసి దీక్షలు
ఢిల్లీ: 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఢిల్లీకి వచ్చి చక్రం తిప్పుతాడనుకుంటే.. కొత్త చక్రాలు వెతుక్కోవడానికి వచ్చాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. 2014లో చంద్రబాబును నడిపించిన రెండు చక్రాలు (బీజేపీ, జనసేన) విరిగిపోయాయన్నారు. పార్లమెంట్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం దేశ వ్యాప్తంగా తెలవాలని ఎన్డీయే ప్రభుత్వంపై మొట్ట మొదటి అవిశ్వాస తీర్మానం వైయస్‌ఆర్‌ సీపీ ఇచ్చిందన్నారు. మార్చి 16వ తేదీ నుంచి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తూనే ఉన్నామన్నారు. సభ ఆర్డర్‌లో లేదంటూ స్పీకర్‌ ప్రతి రోజు సభను వాయిదా వేస్తూ వస్తున్నారన్నారు. రేపటితో పార్లమెంట్‌ ముగియనుండడంతో సభలో ప్రత్యేక హోదా గురించి చర్చించే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కలిసి కోరనున్నట్లు చెప్పారు. ఒకవేళ సభలో హోదా అంశంపై చర్చ జరగని పక్షంలో ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి చేస్తున్న దుర్మార్గాన్ని నిరసిస్తూ వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలమంతా రాజీనామాలు చేస్తామన్నారు. 

ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఊపిరి లాంటిదని, దాన్ని కాపాడుకోవడం కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తామని వైయస్‌ఆర్‌ సీపీ అధినే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారన్నారు. చంద్రబాబు డ్రామా కంపెనీ నడుపుతున్నాడని, ఎప్పుడూ పార్లమెంట్‌కు రానట్లుగా మెట్లకు వంగి నమస్కారం పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఫొటో షూట్‌ కోసం మూడు సార్లు ఒంగి మొక్కుతున్నాడన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రమే చంద్రబాబు ఢిల్లీ వచ్చాడని, చంద్రబాబు కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. 

నాలుగేళ్లుగా ఆంధ్రరాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన చంద్రబాబు తన ప్రభుత్వంపై సీబీఐ ఎంక్వైరీ వేసుకోవాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. దొంగతనం చేసిన వ్యక్తే దొంగా.. దొంగ అని అరిచినట్లుగా బాబు వైఖరి ఉందన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చినప్పుడు నిజాయితీ నిరూపించుకోవాలి కానీ.. సీబీఐ విచారణ అవసరం లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తన ప్రభుత్వంపై, పరిటాల రవి హత్య విషయంలో ఆరోపణలు వస్తే సీబీఐ ఎంక్వైరీ వేసుకొని తన నిజాయితీ నిలుపుకున్నారని గుర్తు చేశారు. ఏపీలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని కాగ్‌ రిపోర్టు వెల్లడించిందన్నారు. పోలవరం, పట్టిసీమ, రాజధాని భూ కేటాయింపులు, పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వైరీ వేసుకొని చంద్రబాబు తన సశ్చిలతను చాటుకోవాలన్నారు. 
 
Back to Top