బయట ఎవరినీ కలవద్దంటారు..లో లోపల కలుస్తారు


–  హోదా కోసం ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతిస్తాం
 వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
– సీనియర్‌ అని చెప్పుకునే చంద్రబాబు అన్ని స్కీమ్‌లలో స్కాములే
– నీరు–చెట్టు, మట్టి, బాత్‌రూంల నిర్మాణంలో అవినీతే
– కాగ్‌ రిపోర్టులో కూడా రాష్ట్రంలో అవకతవకలు జరిగాయని తేలింది
– రాష్ట్రంలో అవినీతి జరగకపోతే విచారణకు ముందుకు రండి
– నాలుగేళ్లలో ప్రత్యేక హోదా ఇవ్వాలన్ని కేంద్రాన్ని ఎందుకు అడగలేదు
–  ఇప్పుడు హోదా కోసం కోర్టుకు వెళ్తామని చంద్రబాబు డ్రామాలు
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. నాలుగేళ్లు ఎన్‌డీఏలో ఉన్న చంద్రబాబు ఏ నాడు ప్రత్యేక హోదా అడగలేదని, ఇప్పుడు పోరాటం చేస్తున్నట్లు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. బయటికి మాత్రం బీజేపీ నేతలను కలవద్దు అని చంద్రబాబు చెబుతూనే..లో లోపల కేంద్ర మంత్రులను కలిసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా విషయంలో ఎవరు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టినా మద్దతిస్తామని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా సత్తనపల్లె వద్ద సోమవారం పార్టీ పార్లమెంటరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

 వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎన్‌డీఏ ప్రభుత్వం ఏవి«ధంగా ఏపీకి అన్యాయం చేస్తుందో మేం మొదటి నుంచి చెబుతున్నామన్నారు. ఇప్పటికైనా చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై పోరాటం చేయాలని గుర్తుకు రావడం శుభపరిణామమన్నారు. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి రహస్యంగా అరుణ్‌జైట్లీని కలిశారన్నారు. నాలుగేళ్లుగా ఎన్‌డీఏలో ఉండి టీడీపీ ఏం సాధించలేదన్నారు. ఇప్పుడేమో ఎవరిని కలువవద్దని చంద్రబాబు డ్రామాలాడుతున్నారన్నారు. నాలుగేళ్లుగా వైయస్‌ఆర్‌సీపీ వైయస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామన్నారు. పార్లమెంట్‌లో కూడా పోరాటం కొనసాగిస్తున్నామన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేస్తారని గ్రహించి ముందుగానే అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు. మేం ఐదుగురు ఎంపీలమే ఉన్నా మా శక్తిమేరకు పోరాటం చేస్తున్నామన్నారు. అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు కోరితే అందరూ ముందుకు వచ్చారన్నారు. టీడీపీ మా అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వమన్నారు. మళ్లీ 12 గంటలకే మద్దతిస్తామన్నారు. అంతలోనే మళ్లీ మేమే అవిశ్వాస తీర్మానం పెడతామని మాట మార్చారన్నారు. టీడీపీని తెలుగు డ్రామాల పార్టీ అని మిత్రపక్షమైన బీజేపీ విమర్శిస్తుందన్నారు. 

రాజకీయ కారణాల కోసమే ఎన్‌డీఏ నుంచి బయటకు వెళ్లారని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారని, దానికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే..చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి శాసన మండలి సాక్షిగా ఎదురుదాడికి దిగడం దారుణమన్నారు. నిన్నటి దాకా మీతో కలిసి నడిచిన బీజేపీకి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఏపీలో అవినీతి జరిగిందని కాగ్‌ నివేదికలు బయటపెట్టిందన్నారు. దీనికి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడం సరికాదన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే కాగ్‌ నివేదికపై సీబీఐ విచారణకు ముందుకు రావాలన్నారు.

దేశంలోనే తానే సీనియర్‌ నాయకుడు అని చెప్పుకునే చంద్రబాబు నాలుగేళ్లుగా ఏ ఒక్క మంచి పనైనా చేశారా అని నిలదీశారు. ఒక పథకమైనా మీ పేరు చెప్పుకునే దాఖలాలు ఉన్నాయా అన్నారు. నీరు చెట్టు, చివరకు స్వచ్ఛభారత్‌ కింద మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇవాళ ప్రత్యేక హోదా విషయంలో న్యాయపోరాటం చేస్తామని చంద్రబాబు పేర్కొనడం విడ్డూరంగా  ఉందన్నారు. కోర్టు ప్రత్యేక హోదా వద్దని మీరే చెప్పారని ప్రశ్నిస్తే..ఏం సమాధానం చెబుతారు బాబు అని నిలదీశారు. నాలుగేళ్లుగా ఎందుకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారని మండిపడ్డారు. ముంపు మండలాలు ఇచ్చిన తరువాతే సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేస్తానని పట్టుపట్టిన చంద్రబాబు ఆ రోజు ప్రత్యేక హోదాను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. మీరు వేసే డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పైకేమో బీజేపీతో కలవొద్దు అంటున్నారు..లోలోపల కలిసిపోతున్నారని విమర్శించారు. కేసులకు భయపడే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. 

రాష్ట్ర ప్రయోజనాల కోసం మేం ఎలా పోరాటం చేస్తున్నామో..మా మాదిరిగా పోరాటం చేయాలన్నారు. మేం పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజు ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని, చిత్తశుద్ధి ఉంటే టీడీపీ కూడా రాజీనామాలకు సిద్ధం కావాలని సూచించారు. హోదా పోరాట విషయంలో మా అధినేత వైయస్‌ జగన్‌ చెప్పినట్లు వింటామని, ఎంతటి త్యాగానికైనా సిద్ధమే అన్నారు. ఊపిరి ఉన్నంత వరకు పోరాటం సాగిస్తామని, ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
 
Back to Top