వైవీ సుబ్బారెడ్డికి విజ‌య‌మ్మ ప‌రామ‌ర్శ‌ఢిల్లీ: ప‌్ర‌త్యేకహోదా కోసం ఢిల్లీ ఆసుప‌త్రిలో ఆమ‌ర‌ణ దీక్ష కొన‌సాగిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని వైయ‌స్ విజ‌య‌మ్మ ప‌రామ‌ర్శించారు. నాలుగు రోజులుగా ఏపీ భ‌వ‌న్‌లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష కొన‌సాగిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీల‌లో ఇవాళ వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించింది.  వైద్యుల సూచన మేరకు సిబ్బంది సాయంతో పోలీసులు బలవంతంగా సుబ్బారెడ్డిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. కానీ ఫ్లూయిడ్స్‌ ఎక్కించుకునేందుకు ఆయన నిరాకరిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించిందని వైద్యులు చెబుతున్నారు. సోమవారం ఉదయం సుబ్బారెడ్డిని పరీక్షించిన వైద్యులు ఆయన పూర్తిగా డీహైడ్రేషన్‌కు గురయ్యారని తెలిపారు. ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే చికిత్స చేయాలని వైద్యులు చెప్పినా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వైవీ సుబ్బారెడ్డి మాత్రం దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. ఆయన ఇంకా దీక్ష కొనసాగించడం శ్రేయస్కరం కాదని డాక్టర్లు చెప్పారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుందని చెప్పిన వైద్యులు ఆయనకు ఫ్లూయిడ్స్‌ ఎక్కించేందుకు యత్నించగా అందుకు ఆయన నిరాకరించారు. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి షుగర్ లెవల్స్ 66 పాయింట్లకు పడిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Back to Top