ఎవ‌రిని వంచించేందుకు దీక్ష చేస్తున్నావు బాబూ?

విశాఖ‌:  నాలుగేళ్లు ప్ర‌త్యేక హోదా ఊసే ఎత్త‌ని చంద్ర‌బాబు ఇప్పుడు ఎవ‌రిని వంచించేందుకు దీక్ష చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్ర‌శ్నించారు. విశాఖ‌లో నిర్వ‌హించిన వంచ‌న వ్య‌తిరేక దీక్ష‌లో ఆయ‌న మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడియాశలు చేశారని ధ్వ‌జమెత్తారు. ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదాను నాలుగేళ్లపాటు కేంద్రం వద్ద తాకట్టు పెట్టిన చంద్రబాబు, ఇప్పుడు ప్రజలకు మభ్యపెట్టడానికి కొంగ దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు ఏముఖం పెట్టుకొని ధర్మపోరాటం పేరుతో దీక్ష చేస్తున్నారంటూ నిలదీశారు. ఆనాడు సభలో హోదా పదేళ్లు ఇవ్వాలని జైట్లీ, వెంకయ్యనాయుడు డిమాండ్‌ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేకహోదా పదేళ్లు ఇస్తానని మోదీ అంటే కాదు పదిహేనేళ్లు తెస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారని, నేడు ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ కావాలంటూ చెప్పి రాష్ట్ర భవిష్యత్తును కాలరాశారని విమర్శించారు. తెలుగుదేశం ఎంపీలు నాలుగేళ్లపాటు కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారంటూ విమర్శించారు. జైట్లీ ప్యాకేజీని ప్రకటించినప్పుడు అంగీకరించిన బాబు ఇప్పుడు.. హోదా కావాలంటూ యూటర్న్‌ తీసుకున్నారంటూ మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం విష‌యంలో కూడా పూట‌కో మాట మాట్లాడార‌ని విమ‌ర్శించారు. మేం ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామా చేస్తే టీడీపీ ఎంపీలు ఏం చేశార‌ని నిల‌దీశారు.  నైతిక విలువలకు పాతరేసిన వ్యక్తి బాబు అని, ఇక ఆయన్ను ప్రజలు ఏమాత్రం సహించరని సుబ్బారెడ్డి హెచ్చ‌రించారు.   
 
Back to Top