ప్రధాని ఎందుకు లోక్‌సభకు రావడం లేదు


– టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలి
– మాతో పాటు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవాలి

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్‌కు వచ్చి కూడా లోక్‌సభకు రావడం లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. సభను ఆర్డర్‌లో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, దుగ్గిరాజుపట్నం, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వేజోన్‌ వంటి అంశాలపై కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించకుండా దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. విలువైన సభాసమయాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం వృథా చేసిందన్నారు.  ప్రధాని పార్లమెంట్‌కు వస్తారు కానీ, లోక్‌సభకు రావడం లేదన్నారు. దీనిపై సమాధానం చెప్పాలన్నారు. చివరి ఘట్టానికి వచ్చామని, రేపు కూడా అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నారు. అప్పటికీ కేంద్రం స్పందించకపోతే మా ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామన్నారు.

మా నాయకులు వైయస్‌ జగన్‌ ఇప్పటికే టీడీపీ ఎంపీలకు విజ్ఞప్తి చేశారన్నారు. ఇప్పటికైనా టీడీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఆమరణదీక్షల్లో పాల్గొని తెలుగు వారి సత్తా చాటుదామన్నారు. అలా చేయకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను ఎలుగెత్తి చాటుదామన్నారు. నాలుగేళ్లు ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉండి ఏమీ సాధించలేని చంద్రబాబు ఏడాదిలో ఏం చేస్తారన్నారు. మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం చూసేలా పోరాటం చేద్దామని, కేంద్రం మెడలు వంచుదామని అన్నారు. మరోమారు చంద్రబాబు రాజీనామాల విషయంలో ఆలోచన చేయాలని కోరారు. కాలయాపన కోసమే చంద్రబాబు వేసిన జాయింట్‌ యాక్షన్‌ కమిటీలు పనికి వస్తాయన్నారు. ప్రత్యేక హోదాకోసం మీరు కూడా మాతో కలిసి రావాలని అవినాష్‌రెడ్డి కోరారు. 
 
Back to Top