ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకుంటేనే అసెంబ్లీకి

కోర్టు దోషిగా తేల్చిన చింతమనేని అసెంబ్లీ సీటును ఖాళీగా ప్రకటించాలి
రాజ్యాంగం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరాం
విజయవాడ: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ఢిల్లీలో ధర్నా అనంతరం 6వ తేదీ అసెంబ్లీకి హాజరవుతామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచి టీడీపీకి అమ్ముడుపోయిన 23 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అంతే కాకుండా దోషిగా తేలిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సీటును ఖాళీగా ప్రకటించాలని కోరడం జరిగిందన్నారు. ఈ మేరకు విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రెండు విషయాలపై స్పీకర్‌ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. ఒకటి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, మరొకటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నియోజకవర్గాన్ని ఖాళీగా ప్రకటించాలని కోరామన్నారు. గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా స్పీకర్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాజ్యాంగంలోని షెడ్యుల్‌ 10 ప్రకారం ఫిరాయంపుదారులపై స్పీకర్‌ వేటు వేయాలన్నారు. కాబట్టి ఎటువంటి కాలయాపన లేకుండా ఈ రోజుకు ఈ రోజే వేటు వేస్తే 5వ తేదీన ఢిల్లీలో ధర్నా ముగించుకొని 6వ తేదీన అసెంబ్లీకి హాజరవుతామన్నారు.  
కోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పీకర్‌ చర్యలు తీసుకోవాలి
లిల్లీథామస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకారం 2013 జూలై 10న పేరా నంబర్‌ 17లో సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా దోషిగా కోర్టు శిక్ష ఖరారు చేసిన ఎమ్మెల్యే సీటు స్థానాన్ని ఖాళీగా ప్రకటించాలని చెప్పిందన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకోవాలని స్పీకర్‌ను విజ్ఞప్తి చేశామన్నారు. ఒక కేసులో రెండు సంవత్సరాలు, మరో కేసులు ఆరు నెలలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కోర్టు జైలు శిక్ష విధించిందన్నారు. అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం దోషిగా తేలిన శాసనసభ్యుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు కానీ, సభ్యుల ఎంపికకు ఓటు వేయడానికి కానీ అనర్హుడన్నారు. ఈ విషయాలన్నీ స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. గతంలో ఎలక్షన్‌ కమిషన్, అసెంబ్లీ సెక్రటరీలకు కూడా వినతిపత్రాలు అందించామన్నారు. రాజ్యాంగం ప్రకారం స్పీకర్‌ తక్షణమే ఫిరాయింపుదారులపై, కోర్టు దోషిగా తేల్చిన దెందులూరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. 
 
Click 
Back to Top