పీకే నాయకులెవరో? పెట్టె నాయకులెవరో ప్రజలకు తెలుసు
– కర్నూలులో చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు
– ప్రతిపక్షాన్ని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదు
– చంద్రబాబు పది లక్షల పింఛన్లు పీకేశారు
– 10 లక్షల రేషన్‌కార్డులు పీకేశారు
– 2 లక్షల మంది ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు
– చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు
– వర్ల రామయ్యకు రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు

విజయవాడ: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ ఖండించారు. పీకే నాయకులు ఎవరో? పెట్టే నాయకులు ఎవరో ప్రజలకు బాగా తెలుసు అని ఆయన పేర్కొన్నారు. నిన్న కర్నూలు పర్యటనలో చంద్రబాబు ప్రతిపక్షాన్ని ఉద్దేశించే వారేం పీకారని అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగదన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం వరప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. 2002వ సంవత్సరంలో నరేంద్ర మోదీ గోద్రా ఘటనలో తప్పు చేశారని చంద్రబాబు దుర్భాషలాడారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనికి ఆయన్ను రానివ్వనని చెప్పారన్నారు. చంద్రబాబుకు నిజంగా ఆత్మాభిమానం ఉండి ఉంటే..2014లో మోదీతో పొత్తు పెట్టుకునే వారు కాదన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు పొత్తుల కోసం మోదీ చుట్టూ ప్రాకులాడారని విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి ప్రయాణం చేసిన చంద్రబాబు ఏ రోజు కూడా బీజేపీని ప్రశ్నించలేదన్నారు. విభజన చట్టంలోని ఈ ఒక్క అంశాన్ని కూడా అడగకుండా, కేంద్రం నుంచి వస్తున్న ప్రత్యేక ప్యాకేజీని తీసుకొని ఇవాళ మళ్లీ వారిపై బురదజల్లె ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏపీ అభివృద్ధి కాకపోవడానికి మోదీ కంటే చంద్రబాబు ప్రధాన కారణమన్నారు. ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో లేఖఇచ్చి విడగొట్టించారన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని తీసుకురాలేకపోయారన్నారు. 2018 నాటికి దుగ్గరాజపట్నం పోర్టు పూర్తి చేయాలని విభజన చట్టంలో ఉంటే..చంద్రబాబు మాత్రం దుగ్గరాజుపట్నం వద్దని దానికి బదులు మరోకటి కోరారని తెలిపారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు అసమర్ధత, ఆయన అవినీతే కారణమన్నారు. 29 సార్లు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రిక్తహస్తాలతో తిరిగి వచ్చారన్నారు. అధికార కాంక్షతో బీజేపీతో పొత్తు పెట్టుకొని , అడగాల్సింది అడకకుండా చంద్రబాబే అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు.

బాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు
ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని వరప్రసాద్‌ హెచ్చరించారు.  వైయస్‌ఆర్‌సీపీకి గుణపాఠం నేర్పాలని నిన్న కర్నూలు జిల్లాలో చంద్రబాబు అనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. నీ అవినీతితో గుణపాఠం చెబుతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో కూడా పెద్ద తప్పు చేశారన్నారు. ప్రతిపక్షం నామమాత్రంగా ఉండాలని పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఎన్నికల సమయంలో ఏవోవే హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు .ఇలాంటి వ్యక్తి మాకు గుణపాఠం చెప్పాలని పిలుపునివ్వడం సిగ్గుచేటు అన్నారు. ఇంగితజ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా అలాంటి మాటలు మాట్లడరన్నారు. ఆయన వ్యాఖ్యలను వరప్రసాద్‌ ఖండించారు. 

అది చంద్రబాబు అవివేకం..అహంకారం
ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అయిన మీడియాపై చంద్రబాబు చి్రరుబు్రరులాడటం బాధాకరమన్నారు. టీడీపీ పాలనలో ఏ ఒక్క పథకం కూడా పునాదుల వద్ద ఆగిపోయాయని ఓ విలేకరి ప్రశ్నిస్తే..ముఖ్యమంత్రి స్థాయిలో సరైన సమాధానం ఇవ్వాల్సిన వ్యక్తి ..రిపోర్టర్‌పై దుర్భాషలాడుతూ..ప్రతిపక్షం ఏం పీకారని అనడం చంద్రబాబుకు తగదన్నారు. ఆయనది అవివేకమని ఖండించారు. ఎవరు ఏం పీకారో చెబుతాను వినండి అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 10 లక్షల పింఛన్లు తొలగించారు. వయోవృద్ధుల వయస్సు 60 నుంచి 65 ఏళ్లకు పెంచి పింఛన్లు తొలగించారని తెలిపారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి రేషన్‌కార్డులు తొలగించారు. 2 లక్షల కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. 60 ఏపీ ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు మూసివేయించారన్నారు. వ్యవసాయం దండుగ అని చెప్పి ఉచిత విద్యుత్‌ను పీకేశారని వివరించారు. ఆ పీకే నాయకులు ఎవరూ?మీరు పీకే నాయకులా? అని నిలదీశారు. దయచేసి ఇలాంటి అసభ్య, అహంకారపూరిత మాటలు మాట్లాడొద్దని హితవు పలికారు. 

వైయస్‌ఆర్‌ది పెట్టే గుణం
దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకునేలా చేశారని గుర్తు చేశారు. పెట్టే ఆలోచన విధానం వైయస్‌ఆర్‌ది అన్నారు. ఆరోగ్యశ్రీ ఎవరికి తోచని పథకాన్ని ప్రవేశపెట్టి..పేదవారికి కార్పొరేట్‌ వైద్యం అందించిన మహానుభావుడు వైయస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. పావలా వడ్డీలు ఇచ్చి శాశ్వతంగా నిలిచిపోయారన్నారు. ఉచిత విద్యుత్‌ ఇచ్చి రైతులను ఆదుకున్నారన్నారు. 108, 104 పథకాలు ప్రవేశపెట్టింది ఆ మహానుభావుడే అన్నారు. 48 లక్షల పక్కా ఇల్లు కట్టించిన ఘనత వైయస్‌ఆర్‌దే అన్నారు. ఎవరు పీకే నాయకులు? ఎవరు పెట్టే నాయకులో ప్రజలు నిర్ణయిస్తారన్నారు.

ఒక్కటైన మంచి పని చేశావా బాబూ?
గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు..ఇప్పుడు నాలుగేళ్లు సీఎంగా కొనసాగుతున్నారని, ఆయన ఒక్కటైన మంచి పని చేశారా అని ఎంపీ వరప్రసాద్‌ ప్రశ్నించారు. తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో 2004–2009 వరకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మూడు ఎస్‌ఈజెడ్‌లు ఏర్పాటు చేశారన్నారు. శ్రీ సిటీ పెట్టి 150 పెద్ద పెద్ద కంపెనీలు తిరుపతికి తెచ్చారన్నారు. మరో ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటు చేశారు. మరో ఎస్‌ఈజెడ్‌ మానుకూరులో పెట్టారని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు కూడా వైయస్‌ఆర్‌పెట్టిందే. మన్నవరం రూ.6 వేల కోట్లతో పెట్టింది ఆయనే అన్నారు. చంద్రబాబు ఈ నాలుగేళ్లలో ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా ఒక్క ప్రాజెక్టు అయినా ప్రారంభించి..పూర్తి చేశారా అని నిలదీశారు. హీరో మోటర్‌కు శంకుస్థాపన చేశారే తప్ప ఇంతవరకు పూర్తి చేయలేదన్నారు. మీ అసమర్ధత కారణంగా అభివృద్ధి చేయలేక..వేరే వారిపై విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు. బీజేపీపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు. ఎంపీ పదవులకు రాజీనామా చేసింది వైయస్‌ఆర్‌సీపీనే అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప..రాజకీయ ప్రయోజనాలు వైయస్‌ఆర్‌సీపీకి అవసరం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం చంద్రబాబుకు తగునా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలను ఈ విధంగా నాశనం చేయడం చంద్రబాబుకు భావ్యమేనా అని నిలదీశారు. మా పార్టీ నుంచి మీ పార్టీలో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలని కోరితే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ప్రజాస్వామ్యంలో వీలు లేదన్నారు. 600 అబద్ధాలు చెప్పి, ప్రత్యేక హోదా తెస్తామని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని బీజేపీ, టీడీపీలు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబుపై నమోదైన ఓటుకు కోట్లు కేసు, అవినీతి, అసమర్ధత కారణంగా ఇవాళ ఏపీ అభివృద్ధి చెందడం లేదని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదని, ఇంతవరకు మా పార్టీ అధికారంలో లేదని గుర్తు చేశారు. 


వర్ల రామయ్యకు ఇంగితజ్ఞానం లేదు
వర్ల రామయ్య డీఎస్పీగా పని చేసి, ఇవాళ ఆర్టీసీ చైర్మన్‌గా ఉంటూ ఓ యువకుడిపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. పది మంది ముందు వాడు..వీడు అని అనడం దారుణమన్నారు. ఎంత పేదవాడు అయినా ప్రజాస్వామ్యంలో ప్రభువులే అన్నారు. ఆ యువకుడిని నా కొడకా అని రామయ్య అనడం సరైంది కాదన్నారు. అందరి ముందు ఓ యువకుడిని వేధవా..నా కొడకా అని దుర్భషలాడటం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు కూడా ఇలాగే దళితులను దూషించారని గుర్తు చేశారు. కులాన్ని దూషించడానికి టీడీపీ నేతలకు ఇంగితజ్ఞానం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు 30 ఏళ్లు ప్రజాస్వామ్యంలో ఉండి ఏం నేర్చుకున్నారో అని అనుమానం వ్యక్తం చేశారు. వర్ల రామయ్య రాజకీయాల్లో ఉండటానికి అర్హుడా అన్నారు. ఆయన్ను తన పార్టీలో పెట్టుకోవడం చంద్రబాబుకు తగునా అన్నారు. 
 
Back to Top