ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరు ఆగదు

ఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. ఢిల్లీలో సోమవారం ఎంపీలు హోదా ఇవ్వాలని కోరుతూ లోక్‌సభ వెల్‌లోకి చొచ్చుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభను స్పీకర్‌ వాయిదా వేశారు. అనంతరం ఎంపీ వరప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రాన్ని కొత్తగా ఏమీ అడగడం లేదని,ఆ రోజు పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే ఆందోళన చేపడుతున్నట్లు చెప్పారు. నాడు రాజ్యసభలో బీజేపీ తరఫున వెంకయ్య నాయుడు, సుష్మస్వరాజ్‌ లాంటి నాయకులు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారని, తిరుపతి బహిరంగ సభలో నరేంద్రమోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. బీజేపీ, టీడీపీ మేనిపెస్టోలో కూడా ఇదే అంశాన్ని చేర్చారని తెలిపారు. హోదా సాధనకు నాలుగేళ్లుగా వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారని చెప్పారు. మార్చి 5 నుంచి ఎంపీల ఆందోళన కొనసాగుతుందని, ఈ నెల 21న పార్లమెంట్‌లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఎంపీ పేర్కొన్నారు. 

 
Back to Top