రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదు


- ఈ నెల 29న  స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలవనున్న ఎంపీలు 
హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఎంపీ ప‌ద‌వుల‌కు చేసిన రాజీనామాల‌పై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ పదవులకు రాజీనామాలు సమర్పించిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు  లోక్‌ సభ స్పీకర్‌ కార్యాలయం నుంచి పిలుపువచ్చింది. ఈ నెల 29న లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను స్పీకర్‌ కార్యాలయంలో కలవనున్నట్లు హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.  స్పీకర్ వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తారని తెలిపారు. రాజీనామా చేసిన ఎంపీలు అందరూ తిరిగి ప్రజల్లోకి వెళ్లి చిత్తశుద్ధిని నిరూపించుకుంటారని పేర్కొన్నారు. ఉప ఎన్నికలు వస్తే గెలిచి తీరుతామని మిథున్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసిన విషయం విదితమే.  పార్లమెంట్‌ నివరధిక వాయిదా పడిన అనంతరం ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి, మిథున్‌ రెడ్డిలు స్పీకర్‌ను కలుసుకుని, రాజీనామా పత్రాలను సమర్పించారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రూపొందించిన రాజీనామాలను పరిశీలించిన సుమిత్రా మహాజన్‌.. నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ఎంపీలకు సూచించారు. అందుకు సున్నితంగా తిరస్కరించిన ఎంపీలు.. రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ఆమరణ దీక్ష చేసిన విషయం తెలిసిందే.


Back to Top