హోదా రాకపోవడానికి బాబే కారణం


– వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

– హోదా లేకుంటే భవిష్యత్‌ లేదని వైయస్‌ఆర్‌సీపీ పోరాటం
– హోదా ఉద్యమానికి వెళ్తే జైలులో పెడతామని బాబు బెదిరించారు

 
విజయవాడ: పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు తీరు కారణమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. దిక్కు లేని పరిస్థితిలో చంద్రబాబు వైయస్‌ జగన్‌ దారికి వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించిన సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఉత్కంఠతో ఎదురు చూశారని, ఈ నెల 21న లోక్‌సభ స్పీకర్‌ వైయస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించారని తెలిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మొదటి ఎన్నికల నాటి నాయకుల ప్రసంగాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు. టీడీపీ, బీజేపీలు రెండూ కూడా తమ మేనిఫెస్టోలో కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, తెస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. విభజన బిల్లులో కొన్ని పొందుపరిస్తే..రాజ్యసభలో ఏపీకి అదనంగా కొన్ని వెసులుబాట్లు కలుగజేయాలని భావించి, దేశంలో అప్పటికే 11 రాష్ట్రాలకు కలిగిన ప్రత్యేక హోదాను ఏపీకి ఇస్తేనే రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయని పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చారన్నారు. మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఐదేళ్లు ప్రత్యేక మోదా ఇస్తామంటే ఆ నాటి బీజేపీ ఎంపీ వెంకయ్యనాయుడు పదేళ్లు కావాలన్నారు. టీడీపీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాన్‌ కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ఖరాకండిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తరువాత పరిణామాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు. రాజకీయాల్లో ఒక హామీ ఇచ్చిన తరువాత వాటిని అమలు చేయాల్సిన చిత్తశుద్ది ఆ పార్టీకి ఉంటుందన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. చాలాసార్లు మోడీ ప్లానింగ్‌ కమిషన్‌ రద్దు అయ్యింది కాబట్టి హోదా ఇవ్వలేమని చెప్పారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 11 నెలల పాటు ప్లానింగ్‌ కమిషన్‌ ఉందని చెప్పారు. ఈ కమిషన్‌కు ప్రధానినే చైర్మన్‌గా ఉన్నారని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వమని ఏనాడు చెప్పలేదని తెలిపారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబు అడగడంతో కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అర్ధరాత్రి ప్రకటించారన్నారు. అప్పుడు చంద్రబాబు నా రక్తం మరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు. ఐదు నిమిషాలకే ప్రత్యేక ప్యాకేజీని చంద్రబాబు స్వాగతించారని తెలిపారు. 
– ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే అభివృద్ధి సాధ్యమని వైయస్‌ జగన్‌ నాయకత్వంలో నాలుగేళ్లుగా అనేక ఉద్యమాలు, కార్యక్రమాలు చేపట్టినట్లు ఉమ్మారెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు అనేకసార్లు హేళనగా మాట్లాడారని, బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. యువభేరిలకు హాజరైతే కేసులు పెడతామని, జైలుకు వెళ్తారని పిల్లలను భయపెట్టారన్నారు. పీడీ యాక్ట్‌ కింద కేసులు పెడతామని హెచ్చరించారని తెలిపారు. విశాఖలో  వైయస్‌ జగన్‌ క్యాండిల్‌ ర్యాలీకి హాజరవుతుంటే చంద్రబాబు అడ్డుకున్నారని తెలిపారు. రాజ్యంగనేతలందరికి వద్దకు వైయస్‌ జగన్‌ వెళ్లి ఏపీకి ప్రత్యేక హోదా కావాలని కోరారని పేర్కొన్నారు. రాష్ట్రపతి, ప్రధానిలకు వినతిపత్రాలు అందజేశారన్నారు. ప్రభుత్వం రెండుసార్లు మొక్కబడిగా అసెంబ్లీలో తీర్మానాలు చేయించిందన్నారు. వైయస్‌ఆర్‌సీపీ సహకరించి పంపించిన తీర్మానాలు పట్టించుకోలేదన్నారు. అవమానపరచొద్దని, ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరితే పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? ఏం లబ్ది ఉంటుందని ఎదురు ప్రశ్నించారని తెలిపారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసిన చంద్రబాబు మోడీని పొగడ్తలతో ముంచెత్తారన్నారు. దిక్కులేని పరిస్థితిలో, వేరే మార్గం లేని పరిస్థితిలో వైయస్‌ఆర్‌సీపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చే స్తుందని, యూటర్న్‌ తీసుకున్నారన్నారు. చంద్రబాబు తీరు ఆశ్చర్యకరమన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడదామని వైయస్‌ జగన్‌ పిలుపునిస్తే సహజంగా హేళనగా మాట్లాడిన చంద్రబాబు మరుసటి రోజు మాట మార్చారన్నారు. 
 
Back to Top