రాష్ట్ర ప్రగతికై వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల దీక్ష

ప్రజలు వేలెత్తి చూపిన ప్రతీసారి చంద్రబాబును కేంద్రం కాపాడింది
దానికి ప్రతిఫలంగా హోదాను తాకట్టుపెట్టిన బాబు
హోదా అని మాట్లాడేందుకు సిగ్గుతో తలదించుకోవాలి
విదేశాలకు వెళ్లి ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పాలి
ఢిల్లీ: రాష్ట్ర భవిష్యత్తు.. ప్రజానికం ప్రగతి, నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పదవులకు రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారని పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. వారిలో ముగ్గురి ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్ల సలహాల మేరకు పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారన్నారు. యువ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డిలు దీక్ష కొనసాగిస్తున్నారన్నారు. ఎంపీల దీక్షకు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చేశారని ప్రజలు వేలెత్తి చూపిన ప్రతీ సారి కేంద్రం కాపాడుతూ వచ్చిందన్నారు. దానికి ప్రతిఫలంగా చంద్రబాబు హోదాను కాలరాసి కేంద్రానికి సపోర్టు చేశారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్న చంద్రబాబు సిగ్గుతో తలదించుకొని ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించాలన్నారు. కేంద్రంపై మొదటిసారిగా వైయస్‌ఆర్‌ సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే అసెంబ్లీ సాక్షిగా మద్దతు ఇస్తామన్న చంద్రబాబు తెల్లారే సరికి మాట మాటమార్చడన్నారు. 13 సార్లు వైయస్‌ఆర్‌ సీపీ అవిశ్వాసం ప్రవేశపెట్టి కేంద్రం చర్చ కూడా జరగనివ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రం బాగుపడాలనే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి రావాలన్నారు. 
ప్రజలు రోడ్డుమీదుంటే.. మీరు విదేశాలకు వెళ్తారా..?
రాష్ట్రంలో హోదా కోసం ప్రజలంతా రోడ్డుమీదకు వచ్చి ధర్నాలు, దీక్షలు చేస్తుంటే చంద్రబాబు తనకేమీ పట్టనట్లు విదేశీ పర్యటనల పేరుతో విలాసాలు చేస్తున్నారన్నారు. 13వ తేదీ నుంచి సింగపూర్‌ వెళ్తున్నారంట.. గతంలో 19 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లిన చంద్రబాబు రాష్ట్రానికి ఎన్ని నిధులు, ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సింగపూర్, జపాన్, దావోస్, చైనా, దక్షిణ కొరియా, బ్రిటన్, థాయ్‌ల్యాండ్, రష్యా, అమెరికా ఇన్ని దేశాలు వెళ్లి పెట్టుబడులు అంటూ ముచ్చట చెబుతున్నాడన్నారు. ఇదిగాక విశాఖలో సమ్మిట్‌ పెట్టారు. 40 లక్షల ఉద్యోగాలు, రూ.  4 లక్షల కోట్ల పెట్టుబడి అన్నారు.. నలుగురికి ఉద్యోగాలు ఇచ్చినట్లు, నాలుగు రూపాయల పెట్టుబడి వచ్చినట్లు చూపించగలరా చంద్రబాబూ అని ప్రశ్నించారు.
 
Back to Top