స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో వైఎస్సార్సీపీ

వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కమల్ రాజు
ప్రజాభిమానంతో గెలుపు ఖాయం

ఖమ్మంః జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బరిలో నిలిచింది. పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా కమల్ రాజు పోటీచేయనున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. దళిత కుటుంబంలో పుట్టి అనేక ఉద్యమాల్లో పాల్గొని, ప్రజాసమస్యల మీద అవగాహన ఉన్న నాయకుడు కమల్ రాజ్ అని వెంకటేశ్వర్లు తెలిపారు.

ఖమ్మం జిల్లాలో ప్రజాభిమానం పొందిన బలమైన పార్టీగా  వైఎస్సార్సీపీ ఉందని పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇందుకు గతంలో జరిగిన ఎన్నికలే నిదర్శనమన్నారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ది చేకూర్చాయన్నారు.  అందుకే ఆమహనీయుడు మరణించి ఆరేళ్లయినా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడని చెప్పారు. వైఎస్సార్ ఆశయాలను అభిమానించే వారు, ప్రేమించే వారు ఉన్నందునే జిల్లాలో వైఎస్సార్సీపీ దూసుకెళ్తుందని చెప్పారు.  

ఖమ్మం జిల్లాను టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా విస్మరించిందని పాయం వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు.  జిల్లాలో దాదాపు 21 మండలాలు కరవుతో అల్లాడుతుంటే సీఎం బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి జిల్లాలోని కరవు మండలాలను ఆదుకోవాలన్నారు.  ఖమ్మం జిల్లాలో వైఎస్సార్సీపీ అన్ని పార్టీల కంటే బలమైన పార్టీగా ఉందని... స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామని పాయం వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు.
Back to Top