అసెంబ్లీలో పార్టీ ఎమ్మెల్యేల ధర్నా

హైదరాబాద్, 17 డిసెంబర్ 2013:

రాష్ట్ర విభజన బిల్లును అసెంబ్లీలో నిబంధనలకు విరుద్ధంగా, అడ్డగోలుగా ప్రవేశపెట్టడంపై వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సమైక్యాంధ్ర నినాదాలతో సోమవారం అసెంబ్లీని హోరెత్తించింది. శాసనసభా నియమ నిబంధనలను, సంప్రదాయాలను పూర్తిగా ఉల్లంఘించి స్పీకర్ నాదెండ్ల మనోహ‌ర్ బిల్లును ప్రవేశపెట్టడం, ఆ వెంటనే సభను వాయిదా వేయడం ఒక ఎత్తయితే.. ఆ తర్వాత స్పీక‌ర్ స్థానంలోకి వచ్చిన డిప్యూటీ స్పీక‌ర్ మల్లు భట్టి విక్రమార్క బిల్లుపై చర్చ ప్రారంభమైనట్లు ప్రకటించడంపై పార్టీ ‌శాసనసభ్యులు మండిపడ్డారు. బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభలోనే నిరవధిక ధర్నాకు దిగారు. అర్ధరాత్రి వరకు సభలోనే బైఠాయించారు. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో స్పీకర్ అనుమతితో పోలీసులు ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు తరలించారు. వై‌యస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయం వద్ద వదిలిపెట్టారు.

ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి తరలించడానికి పోలీసులు భారీ స్థాయిలో సిబ్బందిని మోహరించి, స్పీకర్ అనుమతి కోసం నాలుగైదు గంటలుగా ఎదురుచూశారు. చివరకు అర్ధరాత్రి దాటాక అరెస్టు చేశారు. సభ వాయిదా పడిన తర్వాత వైయస్ఆర్ కాంగ్రె‌స్ ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, భూమా శోభా‌ నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, బి.గురునాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పినిపె విశ్వరూప్, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, కాటసాని రామిరెడ్డి అసెంబ్లీలోనే కూర్చుండిపోయారు. పోలీసులు తరలించే దాకా తొమ్మిదిన్నర గంటలు అలాగే సభలో నిరసన తెలిపారు.

అంతకు ముందు ఎమ్మెల్యేల ధర్నాను విరమింపజేయడానికి శాసనసభ కార్యదర్శి ఎస్.రాజసదారాం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆయన ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి ధర్నాను విరమించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యేలు ససేమిరా అనడంతో వెనుదిరిగారు. విభజన బిల్లును బీఏసీలో చర్చించకుండా శాసనసభలో ప్రవేశ పెట్టబోమని స్పీకర్ నాదెండ్ల మనోహ‌ర్ తమకు హామీ ఇచ్చి ఇపుడు మాట తప్పారని ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు.

డిప్యూటీ స్పీక‌ర్‌ను నిలదీసిన శోభా నాగిరెడ్డి :
సాయంత్రం 6 గంటల సమయంలో శాసనసభ ఫ్లోర్‌లోకి వచ్చిన డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కను శోభా‌ నాగిరెడ్డి నిలదీశారు. బీఏసీలో చర్చించనిదే శాసనసభకు బిల్లు రాదని చెప్పి ఇప్పుడు చర్చను ప్రారంభించినట్లుగా ఎలా ప్రకటిస్తారని ఆమె ప్రశ్నించారు. అందుకు ఆయన... బీఏసీలో అలాగని ఎవరు చెప్పారు, చెప్పలేదే అని అన్నారు. తాను సరిగ్గానే వ్యవహరించానని, చర్చ ప్రారంభమైనట్లేనన్నారు. ఉదయం సభలో జరిగిన గొడవ సందర్భంగా విరిగిన మైకులను, చెల్లాచెదురుగా పడి ఉన్న బిల్లు కాగితాలను చూడటానికి డిప్యూటీ స్పీకర్ అక్కడకు వచ్చారు. గొడవ సందర్భంగా ఫ్లో‌ర్‌లో ఇంకా ఏమైనా నష్టం జరిగిందా అని ఆరా తీశారు. ఆ సమయంలో అక్కడ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నా ఆయన పట్టించుకోలేదు.

స్పీకర్‌ చర్య అప్రజాస్వామికం:
స్పీకర్ నాదెండ్ల మనోహర్ పూర్తి అప్రజాస్వామిక రీతిలో తెలంగాణ విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శాసనసభా ‌పక్షం ధ్వజమెత్తింది. సోమవారం శాసనసభ వాయిదా అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, ధర్మాన కృష్ణదాస్, కాపు రామచంద్రారెడ్డి అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ‌‘బీఏసీలో చర్చించకుండా, శాసనసభ అనుమతి లేకుండా చర్చకు అనుమతి ఇవ్వడమంటే ఇంతకంటే అప్రజాస్వామిక చర్య మరొకటి లేదు’ అని భూమన దుయ్యబట్టారు.

బీఏసీ సమావేశాన్ని జరపాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రాంతానికి చెందిన సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుతో చెప్పించి, అదే ప్రాంతానికి చెందిన ఉపసభాపతి ఈ చర్చకు అనుమతి ఇవ్వడం అత్యంత దుర్మార్గమని పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. ఇంత ముఖ్యమైన బిల్లు శాసనసభలో ప్రవేశపెడుతుంటే ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా సభకు హాజరు కాలేదన్నారు. తెలంగాణ బిల్లును సజావుగా నడిపించడం కోసమే ఆయన సభకు దూరంగా ఉన్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఎంతటి సమైక్య ద్రోహో దీన్ని బట్టే అర్ధమవుతోందన్నారు.

‘సీఎం, స్పీకర్ కలిసి కాంగ్రె‌స్ అధిష్టానం ఏమి చెబితే, అది గంగిరెద్దులా తల ఊపుతూ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి కారణమయ్యారు. వీళ్లిద్దరూ విభజన ద్రోహులుగా చరిత్ర  పుటలలోకి ఎక్కారు’ ‌అన్నారు. సమైక్యం కోసం పోరాడుతున్న సచివాలయ ఉద్యోగులపై కిరణ్ ‌ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించిందని, దీన్ని తమ పార్టీ ఖండిస్తోందని చెప్పారు.

అప్పుడు భాస్కరరావు.. ఇప్పుడు మనోహర్ :
స్పీకర్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించారిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గతంలో నాదెండ్ల భాస్కరరావు రాజ్యాంగ విరుద్ధంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారని, ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన మనోహ‌ర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారన్నారు.

కలిసిరాని నేతలను నిలదీయండి:
‌సమైక్య రాష్ట్రం కోసం అసెంబ్లీలో తాము ఆందోళన చేస్తూంటే కోస్తా, రాయలసీమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ స్థానాల్లో కూర్చుని చోద్యం చూశారే తప్ప కలిసి రావడం లేదని, అలాంటి వారిని నియోజకవర్గాల్లోని ప్రజలు నిలదీయాలని శోభా నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వై‌యస్ఆర్ సీఎల్పీ ముందు ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, పినిపె విశ్వరూ‌ప్‌తో కలిసి రాత్రి ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగానే సభకు రాలేదని విమర్శించారు. పైలీన్ తుపాను ఆపలేక పోయినా విభజన తుపానును ఆపుతానని ప్రగల్భాలు చెప్పిన కిరణ్.. తీరా బిల్లు వచ్చే సమయానికి తుర్రుమన్నారని విశ్వరూ‌ప్ అన్నారు.

తాజా వీడియోలు

Back to Top