సిఎం చాంబర్‌ వద్ద పార్టీ ఎమ్మెల్యేల ధర్నా

హైదరాబాద్, 18 అక్టోబర్ 2013:

రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి చాంబర్‌ వద్ద ధర్నాకు దిగిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేసి, కొద్దిసేపటి తరువాత విడిచిపెట్టారు. అసెంబ్లీని తక్షణమే సమావేశ పరిచి, సమైక్యాంధ్ర తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్‌ చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్‌ను కలిసి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కొద్దిసేపు సిఎంతో సమావేశమైన వారు ఒక వినతిపత్రాన్ని కూడా అందజేశారు. అయితే, అసెంబ్లీని సమావేశపరచడం కుదరదని సిఎం కిరణ్కుమా‌ర్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనితో ఆగ్రహానికి గురైన పార్టీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు చేతబట్టి ఆయన చాంబర్‌ ఎదుటే బైఠాయించి, నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా అరెస్టుచేసి సైఫాబాద్ పోలీ‌స్ స్టేష‌న్కు తరలించారు. కొద్ది‌ సేపటి అనంతరం వారిని వదలిపెట్టారు.

సిఎంతో పార్టీ ఎమ్మెల్యేల భేటీ :
అంతకు ముందు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ముఖ్యమంత్రి కిర‌ణ్కుమా‌ర్ రెడ్డిని సచివాలయంలో ‌కలుసుకున్నారు. సచివాలయం సి-బ్లాక్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు తక్షణమే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సిఎంతో భేటీ అయినవారిలో శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, సుచరిత, భూమన కరుణాకరరెడ్డి, గొల్ల బాబూరావు, అమర్నాథ్‌రెడ్డి, గొట్టిపాటి, కాటసాని రామిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్ తదితరులు ఉన్నారు.

Back to Top