ప్రజాసమస్యలను ప్రస్తావించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ః  రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన టీడీపీ సర్కార్ పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు . అసెంబ్లీ వేదికగా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వాన్ని ఎండగట్టారు. 

డా.సునీల్ కుమార్(పూతల పట్టు ఎమ్మెల్యే)
పీహెచ్‌సీ ఆస్ప‌త్రుల్లో గ‌త రెండేళ్ల నుంచి దాదాపు రూ. 5కోట్ల 56ల‌క్ష‌ల నిధులు రాజ‌కీయ గ్ర‌హనం వ‌ల్ల మూలుగుతున్నాయ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. పీహెచ్‌సీల‌ను శుభ్ర‌ప‌ర్చేందుకు కూడా నీరు లేని దుస్థితి నెల‌కొంద‌ని, మోట‌ర్లు, ప్యాన్స్ ఏవి ప‌ని చేయ‌డం లేద‌ని అన్నారు.  పేషెంట్ల‌కు కనీస తాగునీటి సౌక‌ర్యం క‌ల్పించ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. గ‌త రెండేళ్ల కాలంలో ఆస్పత్రిలో ఇంత‌వ‌ర‌కు ఒక్క డాక్ట‌ర్‌ను కూడా  నియ‌మించిన దాఖాలాలు లేవ‌ని ఆరోపించారు. మంత్రి మాత్రం వెయ్యి మంది డాక్ట‌ర్లు, వెయ్యి మంది న‌ర్సుల‌ను రిక్రూమెంట్ చేస్తున్నామని చెబుతున్నారే తప్ప...ఒక్కరిని కూడా నియమించిన పాపాన పోలేదన్నారు. 

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి హయంలో నాలుగు వైద్య క‌ళాశాల‌లు ఏర్పాటు చేసి సుమారు 3వేల మందికి ఉపాధి క‌ల్పించార‌ని గుర్తు చేశారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో రోజుకు 40వేల మంది ఇన్ పేషెంట్లుగా చేరుతుంటే, అందులో 4వేల మంది ప్రాణాలు వ‌దిలే ప‌రిస్థితి క‌నిపిస్తుంద‌న్నారు.  స‌గ‌టున రోజుకు సుమారు 10 మంది ఉంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎమ్మారై, సిటీస్కాన్ తీస్తే అది ఎప్పటికో వస్తుందన్నారు. రాష్ట్రంలో రోజుకు 140 మంది పేషెంట్లు డయాలసిస్ కోసం వేచియుండే పరిస్థితి ఉందన్నారు. తిరుప‌తిలో డ‌యాల‌సిస్ మిష‌న్లు 9 ఉంటే... రోజుకు వ‌చ్చే పేషెంట్ల సంఖ్య 80మంది ఉన్నారన్నారు. క‌ర్నూలులో 17 మిష‌న్లుంటే దాదాపు 180 మంది పేషెంట్లు రోజు క్యూలో నిల‌బ‌డుతున్నార‌ని వివ‌రించారు. 

రాష్ట్రంలో శిశుమ‌ర‌ణాల సంఖ్య చాలా ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పారు.  చిత్తూరు జిల్లా తిరుప‌తి రుయా ఆస్ప‌త్రిలో శ్వాస‌కోశ వ్యాధులతో వచ్చే వారికి సరిపడా ఆక్సిజ‌న్‌లు లేకపోవడం బాధాకరమన్నారు. సీఎం నియోజ‌క‌వ‌ర్గంలోని కుప్పంలోనే  శిశుమ‌ర‌ణాల సంఖ్య 80 నుంచి 85 మ‌ధ్య ఉంద‌ని చెప్పారు. ముఖ్యమంత్రి నియోజ‌క‌వ‌ర్గంలోనే ప‌రిస్థితి ఇలా ఉంటే ఇక వేరే నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. దివంగ‌త నేత వైఎస్సార్ ప్ర‌వేశ‌పెట్టిన 108, 104 సేవ‌ల‌కు ప్ర‌భుత్వం పాట‌ప‌డుతుంద‌ని ఫైరయ్యారు.  104 కోసం రూ. 200 కోట్ల నిధులు అవ‌స‌ర‌ముంటే, రాష్ట్ర ప్ర‌భుత్వం కేవ‌లం రూ. 31 కోట్లు కేటాయించింద‌ని చెప్పారు. ఇక 108 వాహ‌నాలకు మ‌ర‌మ్మ‌తులు లేక మూల‌న ప‌డుతున్నాయ‌ని ఆరోపించారు. ఆరోగ్య‌శ్రీకి రూ. 300 కోట్లు బ‌కాయిలు ప‌డ‌డంతో ప్రైవేట్ ఆస్ప‌త్రుల వారు ఆ ప‌థ‌కాన్ని నిలిపివేస్తున్నామ‌ని బ‌హిరంగంగానే ప్ర‌క‌టిస్తున్నార‌ని చెప్పారు. ఆస్పత్రులకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. 

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే)
జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రోగనిర్దారణ పరీక్షలు వంద వరకు చేయాల్సి ఉండగా...పట్టుమని పది కూడా చేసే పరిస్థితి లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆస్పత్రి సమస్యను లేవనెత్తారు. వైద్యుల గైర్హాజరీ, మందుల కొరత కారణంగా నిరుపేద రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాల, కళాశాలలకు నిధులు వెచ్చించి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని సంబంధిత మంత్రిని, ప్రభుత్వాన్ని కోరారు. 

కె. రాజన్నదొర( సాలూరు ఎమ్మెల్యే)
జూట్ పరిశ్రమల కార్మికుల వెతలను ఎమ్మెల్యే రాజన్నదొర అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ దృష్టికి తీసుకొచ్చారు. విజయనగరం, ఎలిమర్ల, బొబ్బిలి, సాలురులో జూట్ పరిశ్రమలన్నీ మూతబడిపోవడంతో...కార్మికులు రోడ్డున పడ్డారని చెప్పారు. ఒక్క సాలూరు నియోజకవర్గంలోనే  జూట్ పరిశ్రమ మూతబడడంతో 1800 మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ...ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లారన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తామని చెబుతున్న ప్రభుత్వం...ఉన్న పరిశ్రమలు కాస్త మూతబడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.  జూట్ పరిశ్రమల మేనేజ్ మెంట్ తో మాట్లాడి వాటిని తెరిపించేవిధంగా కృషిచేయాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని రాజన్నదొర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండేళ్లవుతున్నా గిరిజన సలహామండలి ఎప్పుడు నిర్మిస్తారో చెప్పడం లేదని ప్రభుత్వానికి చురక అంటించారు. ఎస్సీ, ఎస్టీ రుణాలు రివ్యూ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
Back to Top