ఇంతకీ టీడీపీ సీతా? లేక చింతామణా?

అనంతపురం :

ఒక పక్కన తెలంగాణ, మరో వైపున సమైక్య వాదంతో వల్లిస్తున్న టీడీపీ చేస్తున్నది సీత, సావిత్రి కాపురమో లేక చింతామణి కాపురమో పయ్యావుల కేశవ్‌ వివరణ ఇవ్వాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు బి. గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి అన్నారు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని మించిన రాజకీయ చింతామణి ఇంకెవవరున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి కారణంగా టీడీపీ పరిస్థితి తెగిన గాలిపటంలా తయారైందన్నారు. అలాంటి పార్టీ ఆలోచనలను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కాపీ కొడుతోందంటూ పయ్యావుల కేశవ్ ‌అనడం ఈ శతాబ్దానికే అతిపెద్ద జోక్‌ అని వారు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అభివర్ణించారు.

చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలను భరించలేని పయ్యావుల గతంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌లో చేరాలని రాయబారాలు నడిపింది వాస్తవం కాదా? అని నిలదీశారు. ఈ విషయం బయటకు పొక్కేసరికి, మీడియా ముందు ఏడ్చిన పయ్యావుల ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నదానికి పూర్తి విరుద్ధంగా ఆ పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారన్న విషయాన్ని రామచంద్రారెడ్డి, గురునాథరెడ్డి గుర్తుచేశారు.

Back to Top