అసెంబ్లీలో శిఖండిలా వ్యవహరిస్తున్న బాబు

హైదరాబాద్ :

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శిఖండి పాత్ర పోషిస్తున్నారని వైయస్ఆర్‌సీఎల్పీ ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి ధ్వజమెత్తారు. విభజన బిల్లు విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై ఆమె మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డిలతో కలసి శోభా‌ నాగిరెడ్డి మాట్లాడారు.

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో స్పీకర్ పోడియంలోకి పంపిస్తా‌రని, సీమాంధ్ర ఎమ్మెల్యేలు మాత్రం తమ సీట్లలోనే కూర్చుంటారన్నారు. బీఏసీ సమావేశానికి చంద్రబాబు రాకుండా ఇరు ప్రాంత నేతలను పంపి రెండు వాదనలు చేయిస్తారన్నారు. సభలో కూడా నోరు మెదపకుండా చంద్రబాబు శిఖండిలా వ్యవహరిస్తూ, ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి వైయస్ఆర్‌సీపీని, శ్రీ వైయస్ జగ‌న్‌ను విమర్శించే అర్హత లేదన్నారు.

అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని సభా నిబంధన 77 కింద డిసెంబర్ 16‌నే స్పీకర్‌కు మేం నోటీసు ఇస్తే సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతలు అవహేళన చేసిన వైనాన్ని వారు గుర్తుచేశారు. ఇప్పుడు వారు కూడా మా దారిలోకే వచ్చారన్నారు. బిల్లులో లోపాలున్నాయని 43 రోజుల తర్వాత సీఎం కిరణ్‌కు తెలిసిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ‌అధిష్టానం చెప్పినట్టు కిరణ్, చంద్రబాబు నడుచుకుంటున్నారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top